
సంతోష్ వేణు
♦ జీహెచ్ఎంసీలో అవినీతి తిమింగళం
♦ బెదిరింపులకు దిగి వసూళ్లు
♦ రూ.కోట్లల్లో అక్రమ సంపాదన
♦ జీహెచ్‌ఎంసీ ఏసీపీ సంతోష్ వేణుపై ఆరోపణలివీ...
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ అసిస్టెంట్ సిటీప్లానర్(ఏసీపీ) సంతోష్‌వేణు అక్రమాస్తులకు లెక్కేలేదని తెలుస్తోంది. శుక్రవారం ఏసీబీ అధికారులు సిటీలోని తొమ్మిది చోట్ల ఏక కాలంలో చేసిన దాడుల్లో సంతోష్ వేణు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా తెలిసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఆస్తులు కనుకొన్నారు. టౌన్‌ప్లానింగ్‌లో పనిచేస్తున సంతోష్‌వేణు అక్రమార్జనకు పక్కాగా ప్లానింగ్ వేసి అవినీతి చేసేవాడని ఆయన పనిచేసిన పలు సర్కిళ్ల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
జీహెచ్‌ంఎసీ క్యాడర్‌కు చెందిన సంతోష్‌వేణు హైదరాబాద్ స్థానికుడు కావడంతో తనను ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో పాటు తనకు ఇద్దరు ముగ్గురు మంత్రుల అండదండలున్నాయని చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడంటున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్–ఎ సర్కిల్‌లో పనిచేస్తున్న ఆయనకు ఇటీవల ఖైరతాబాద్–బి సర్కిల్‌కు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న ఏసీపీ ఫిల్‌్మనగర్ కల్చర ల్ సెంటర్ పోర్టికో కూలిన ఘటనలో సస్పెండ్‌కావడంతో అక్కడి బాధ్యతలూ సంతోష్‌వేణుకు అప్పజెప్పాల్సి వచ్చింది.
ఈయన ఖైరతాబాద్‌కు బదిలీపై వచ్చి నెల కూడా కాలేదు. అంతకుముందు శేరిలింగంపల్లి–2 సర్కిల్‌లో పనిచేసినప్పుడు భారీయెత్తున సంపాదించారనే ఆరోపణలున్నాయి. ఆ సర్కిల్ పరిధిలోని చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట, మాదాపూర్ ప్రాంతాల్లోని భారీ భవంతుల నిర్మాణాలతోపాటు అక్రమాలను అడ్డగోలుగా ప్రోత్సహిస్తూ భారీగా కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అయ్యప్పసొసైటీ, గోకుల్‌ప్లాట్స్ తదితర ప్రాంతాల్లోనూ భారీమొత్తాల్లో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లిలో పనిచేసినప్పుడు ఆ సర్కిల్‌లో నలుగురి స్థానే ఈయన, మరో టీపీఎస్ మాత్రమే ఉండటంతో భారీ యెత్తున అక్రమాలకు తెరతీశారని వినిపిస్తోంది.
సంతోష్ దాదాపు 35 ఏళ్లుగా జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు. గతంలో ఎస్‌ఓగా ఉండగా...పదోన్నతితో ఏసీపీ అయ్యారు. అక్రమాలను అడ్డగోలుగా ప్రోత్సహించడమే కాక, దారికి రానివారి భవనాలు కూల్చివేస్తామని హెచ్చరించేవాడని చెబుతున్నారు. ఉదయాన్నే నోటీసులిస్తే.. సాయంత్రంలోగా వచ్చి ఆయనతో మాట్లాడుకొని ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే కూల్చివేస్తామని హె చ్చరించేవాడని చెబుతున్నారు. శేరిలింగంపల్లి నుంచి బదిలీ అయ్యే ముందు సైతం ఎఫ్‌టీఎల్ పరిధిలో భవనం నిర్మించుకున్న ఒక రిటైర్డు ఉద్యోగి నుంచి, చందానగర్ నేషనల్‌హైవేలో జరుగుతున్న నిర్మాణాల నుంచి భారీ యెత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ముడుపులు చెల్లించని వారికి బెట్టర్‌మెంట్ చార్జెస్ వంటివి అడ్డగోలుగా విధించేవారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆబిడ్స్ సర్కిల్‌లో పనిచేసినప్పుడు ఒక యజమానికి రూ. 40 వేల బెటర్‌మెంట్ చార్జీలు విధించాల్సి ఉండగా, రూ. 4 లక్షలకు పైగా వేసినట్లు సదరు సర్కిల్‌లోని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవల బీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో క్రమబద్ధీకరణకు అవకాశం లేని వాటిని సైతం క్రమబద్ధీకరిస్తానని లెక్కకుమిక్కిలిగా వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
మచ్చు మరకలు..
సిటీలో అవినీతి ఎక్కువ జరిగే ప్రభుత్వ విభాగాల్లో జీహెచ్‌ఎంసీ ఒకటి అనే ముద్ర పడింది. ఎంతోకాలంగా అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న అక్రమాలు.. పలు సందర్భాల్లో ఏసీబీకి పట్టుబడ్డ వారే ఇందుకు ఉదాహరణలు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఘటనల్లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన వారు.. గుర్తించిన ఆస్తుల విలువ వివరాలిలా ఉన్నాయి.
– మార్చి 10
మలోత్ పీర్‌సింగ్, డీఈఈ, శేరిలింగంపల్లి–2
రూ . 7 కోట్లు
– మే 11
కృపాదానం, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్, సికింద్రాబాద్
రూ. 5 కోట్లు
–ఏప్రిల్ 6
జనార్దన్ మహేశ్, సెక్షన్ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్, సికింద్రాబాద్
రూ. 3 కోట్లు
– 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 మంది జీహెచ్‌ఎంసీ అధికారులు, ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారు. వీరు కాక లంచాలకు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారు మరి కొందరున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గడచిన ఆర్నెళ్ల కాలంలోనే 11 మందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.