సంఘటనస్థలంలో బాలిక మృతదేహం
-
పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు
-
తాడిపర్తి శివారులో వెలుగుచూసిన ఘటన
-
క్లూస్‌టీంతో పోలీసుల విస్తృతతనిఖీలు
గోపాల్‌పేట : గుర్తుతెలియని బాలికను దుండగులు అతికిరాతంగా హత్యచేసి, ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం మండలంలోని తాడిపర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుర్తుతెలియని బాలిక(14)ను ఎక్కడో చంపి తాడిపర్తి సమీపంలోని ప్రధానరహదారి పక్కనుంచి జమ్మికుంటకు వెళ్లే దారిలో వ్యవసాయ పొలంలో పడేసి నిప్పంటించారు. ఉదయం అటువైపు వెళ్తున్న కొందరు రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి టౌన్ ఎస్‌ఐ గాంధీనాయక్, గోపాల్‌పేట ఏఎస్‌ఐ ఇలియాజ్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అప్పటికే పొగలు వస్తుండటాన్ని గమనించిన నీళ్లు పోయించి మంటలను ఆర్పించారు. తెల్లవారుజామునే శవాన్ని తీసుకువచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మృతదేహం పక్కనే బైకు టైరు గుర్తులు ఉన్నాయి. బైకుపై తీసుకొచ్చి ఉంటారని, శరీరంపై బురఖా ధరించి ఉండటంతో ముస్లిం బాలికగా పోలీసులు భావిస్తున్నారు. ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. మృతదేహం పక్కనే ఓ బెడ్‌షిట్, చున్నీ, లోదుస్తులు, ఓ చిన్న కత్తి పడి ఉంది. కుడికాలి బోటన వేలు పూర్తిగా రాసుకుపోయి ఉండడంతో మృతదేహాన్ని బైకుపై తీసుకొచ్చే సమయంలో రోడ్డుపై రాసుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తలపై కొట్టి.. ఆపై ఈడ్చుకొచ్చి
మతురాలి కుడి చేతికి ఓ ఎర్రని దారం ఉంది. తల వెనుక భాగంలో బలమైన రక్తపు గాయాన్ని పోలీసులు గుర్తించారు. తలపై కొట్టిచంపి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బెడ్‌షిట్, దుస్తులు ఉండటంతో బాలికను హాస్టల్ నుంచిగానీ, ఇంటి నుంచిగానీ తీసుకువచ్చారా? ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికలను గుర్తించడం కోసం అన్ని పీఎస్‌లకు సమాచారం ఇచ్చి మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో గాలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాలిక వంటిపై చిలుకపచ్చ రంగు పైజామా (లెగ్గిన్) ఉంది. తాడిపర్తి వీఆర్‌ఓ మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తాడిపర్తిలో భయాందోళనలు నెలకొన్నాయి.