తల్లిదండ్రులు వేధిస్తున్నారని...
కాచిగూడ(హైదరాబాద్): నిత్యం తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ ఓ బాలిక సోమవారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బోడుప్పల్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన జ్యోతిరాణి, శ్రీనివాస్ దంపతుల కూతురు ఐశ్వర్య. లాలాగూడలోని రైల్వే గర్ల్స్ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. శ్రీనివాస్ ఆటో డ్రైవర్. తల్లిదండ్రులు ఇద్దరు మద్యానికి బానిలసై ఆమెను స్కూల్ మాన్పించి, పనిలో పెట్టారు. ఆమెతోనే మద్యం తెప్పించుకుని, గ్లాసుల్లో పోసి తెమ్మనేవారు. ఆమెను తండ్రి శ్రీనివాస్ లైంగిక వేధించేవాడు. అందుకు తల్లి అంగీకరించేది. తన తల్లే తనను సవతిగా చూస్తూ చెప్పుకోడానికి వీలులేని విధంగా తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ఆమెను చంపేందుకు తల్లి ఇటీవల ఓ బస్సు కిందకు నెట్టివేసే ప్రయత్నం చేసింది.
శనివారం కత్తితో పొడవడానికి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులు చంపేస్తారని, వారివద్ద తనకు రక్షణలేదని భావించి ఆమె బాలల హక్కుల సంఘాన్ని వేడుకుంది.. తన మనుమరాలు ఐశ్వర్యను దొంగతనం చేయాలని తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని ఆ బాలిక అమ్మమ్మ ప్రేమ తెలిపింది. తన కూతురే ఇలా చేయడంతో తనమనుమరాలు ఐశ్వర్యకు ప్రాణహానీ ఉందని, తన కూతురు ఇంటికి మనుమరాలిని పంపించేది లేదని కరాఖండిగా చెప్పింది. ఐశ్వర్యకు చదువు చెప్పించి రక్షణ కల్పించి ఆదుకోవాలని ఆమ్మమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ బాలికను వేధిస్తున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయించి వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకునే వరకు బాలల హక్కుల సంఘం పోరాడుతుందని తెలిపారు. ఐశ్వర్యకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు.