ప్రత్యూషను నిమ్స్‌కు తరలించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్
హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రంగా గాయపడి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను నిమ్స్‌కు తరలించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారని, ఇప్పటి వరకు రూ.1.75 లక్షలు విరాళంగా వచ్చాయని వెల్లడించింది. అయితే, ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యూషకు ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు ప్రకటిస్తూనే.. దాతల ద్వారా వచ్చిన ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కింద సొంత ఎకౌంట్‌లో జమ చేసుకుంటోందని ఆరోపించింది.
రూ.1.22 లక్షలు వైద్య ఖర్చుల కింద చూపుతూ, రూ.55 వేలు మాత్రమే బ్యాలెన్స్ చూపిస్తోందని ఆరోపించింది. దాతల నుంచి అందిన ఆర్థిక సహాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. కాగా, ఆస్పత్రిలో ప్రత్యూషకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ స్థానంలో తల్లిలా ఆదరించే మహిళా పోలీసులను రక్షణగా ఏర్పాటు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు పేరు చెప్పి బాలల హక్కుల సంఘం ప్రతినిధులు.. ప్రత్యూషను కలవకుండా అడ్డుకుంటున్న ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డిశ్చార్జ్ సమయంలో తిరిగి ఇస్తాం: డాక్టర్ రవీంద్రనాథ్, గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ
ప్రత్యూష వైద్యానికి దాతలు అందించిన డబ్బులను ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఖర్చులకు వాడుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. ఆమెకు ఉచితంగా వైద్యం చేస్తున్నామని, ఇప్పటికే ఆ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపామన్నారు. ప్రత్యూష డిశ్చార్జైన సమయంలో అధికారుల సమక్షంలో డబ్బులను తిరిగి ఇచ్చివేస్తామని తెలిపారు.