
కీచకుడికే గురువులు!
♦ మసకబారుతున్న ఎస్వీయూ ప్రతిష్ట
♦ కనువిప్పు కలిగించని నాగార్జున యూనివర్సిటీ ఘటన
♦ విద్యార్థులను వేధిస్తున్న ఆచార్యులు
♦ రోజుకో విభాగంలో ఆరోపణలు
గురు సాక్షాత్ పరబ్రహ్మ.. అంటూ గురువులను కీర్తిస్తాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత వారికి ఇస్తాం. ఇపుడు గురుదేవుల పాత్రలో విద్యార్థుల భవితకు మార్గదర్శనం చేయాల్సిన కొందరు కీచకుడి అవతారమెత్తుతున్నారు. వారి వెకిలి చేష్టలను భరించలేని విద్యార్థినులు, సహోద్యోగులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఘటనలను చూస్తే వీరు కీచకుడికే గురువులనాల్సిన దుర్గతి పడుతోందని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు.
సాక్షి, ప్రతినిధి తిరుపతి: విద్యార్థినులను వేధిస్తున్న గురువుల ఉదంతాలు తరచూ ఎస్వీ యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్నాయి. వివిధ విభాగాల్లో వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు గురుదేవుల పాత్రపై నీలినీడలు కమ్ముకుంటూ, సమాజానికి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. బాధితులు పోలీసులు, మీడియాను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఏడు విశ్వవిద్యాలయాలు, 146 డిగ్రీ కళాశాలలు, 35 ఇంజినీరింగ్ కళాశాలలు, 32 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దీనికితోడు నర్సింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర కళాశాలలతో పాటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు.
ఘన చరిత్ర ఉన్న ఎస్వీయూలో..
ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఎస్వీ యూనివర్సిటీలో విచారకర ఘటనలు జరుగుతుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రిషితేశ్వరి ఘటనను మరువకముందే ఎస్వీ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుండటంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
కొన్ని ఉదాహరణలు..
- 2012లో జువాలజీ విభాగానికి ప్రొఫెసర్ రాజేశ్వరరావు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలు పాలయ్యారు.
- 2013లో ఆక్వాకల్చర్‌కు చెందిన ఓ విద్యార్థిని రిటైర్డ్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
- ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ నరేంద్ర వ్యవహార శైలిపై అక్కడి పోస్టు డాక్టోరల్ ఫెలో ఒకరు సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.
- సాంఖ్యకశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ రాజశేఖర్‌రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని పీజీ విద్యార్థిని నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రొఫెసర్ డి.ఉషారాణి ఆధ్వర్యంలో 15 మందితో కమి టీ వేసింది. ఈనెల 19వ తేదీన విచారణ జరగనుంది.
- రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసులు తనను వేధిస్తున్నారని పరిశోధక విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో మూడురోజుల క్రితం ఎస్వీయూ క్యాంపస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు మానసికంగా వేధిస్తున్నారని గత నవంబర్ 9న నలుగురు పరిశోధక విద్యార్థులు ఎస్వీయూ వీసీకి ఫిర్యాదు చేశారు.
ఇతర ఫిర్యాదులూ..
ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఘటనలే కాకుండా ఇతర కేసులు కూడా ఎక్కువయ్యాయి. గతనెల 17న ఎస్‌జీఎస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రెడ్డెప్పరెడ్డి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి రూ.31వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఏడాది జూన్‌లో తెలుగు విభాగంలో అధ్యాపకులు, పోస్టు డాక్టోరల్ ఫెలోలు పరస్పరం రూం కేటాయింపులో ఎస్వీయూ క్యాంపస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇలాంటి విషయాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నా.. చాలా విషయాలు సద్దుమణిగిపోతున్నాయి. వెలుగులోకి రాని ఘటనలు మరిన్ని ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనల వల్ల ఎస్వీ యూ ప్రతిష్ట మసకబారుతోంది. భవిష్యత్తులో ఎస్వీయూకు ఎలాంటి మచ్చ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని, బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.