శాంతించిన వరద గోదావరి
శాంతించిన వరద గోదావరి
Published Thu, Oct 6 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
కొవ్వూరు : గోదావరిలో వరద ఉధృతి తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 5,35,688 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో గురువారం సాయంత్రానికి 3,60,559 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 12,600 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. మిగిలిన 3,47,959 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్టకు నాలుగు ఆర్మ్స్‌లో ఉన్న 175 గేట్లు 0.80 మీటర్లు ఎత్తులేపి వరద నీటిని గోదావరి నుంచి దిగువకు విడిచిపెడుతున్నారు. మరోవైపు భద్రాచలంలో నీటిమట్టం 25.40 అడుగులకు తగ్గింది. శుక్రవారం సాయంత్రానికి ధవళేశ్వరంలో వరద తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పశ్చిమడెల్టాకు నీటి విడుదల పెంపు
ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో పంటలకు సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డెల్టా కాలువలకు నీటి విడుదలను పెంచారు. జిల్లాలోని పశ్చిమ డెల్టాకు 1,500 క్యూసెక్కులను పెంచి 6 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. తూర్పుడెల్టాకు 4,400, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడిచిపెడుతున్నారు. జిల్లాలోని ఏలూరు కాలువకు 454, ఉంyì కాలువకు 699, నరసాపురం కాలువకు 1,604, జీఅండ్‌వీకి 704, అత్తిలి కాలువకు 446 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
Advertisement