బంగారు, వెండి ఆభరణాల చోరీ
బంగారు, వెండి ఆభరణాల చోరీ
Published Tue, Aug 23 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
రావులపాలెం, రంగంపేటల్లో వేర్వేరు సంఘటనలు
రావులపాలెం :
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో 49 కాసుల బంగారం, సుమారు మూడున్నర కిలోల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. రావులపాలెం వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలోని ఒక ఇంటిలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు. బాధితుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న తుట్టగుంట శ్రీరామచంద్రమూర్తి కె.గంగవరం మండలం కుందూరు పీహెచ్‌సీలో ఎంపీహెచ్‌ఈఓగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో విధులకు సెలవు పెట్టారు. సోమవారం ఇంటికి తాళాలు వేసి భార్య రామలక్ష్మితో కలసి కపిలేశ్వరపురం మండలం కోటిపల్లిలోని అత్తవారింటికి వెళ్లారు. మంగళవారం ఉదయం స్థానికులు ఫోన్ చేసి, ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయని చెప్పారు. వారు వచ్చిచూడగా, ఇంటిలోని రెండు బీరువాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై వీపీ త్రినాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఆభరణాలతో పాటు ఎల్‌ఈడీని కూడా దొంగలు అపహరించారు. ఆరు కాసుల బంగారం, సుమారు 3 కిలోల వెండి ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు.
గేటు తాళం పగులగొట్టి..
రంగంపేట : మండల కేంద్రమైన రంగంపేటలో కిరాణా వ్యాపారి గళ్లా శ్రీనివాసరావు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రూ.4.60 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. స్థానిక మెయిన్ రోడ్డు పక్కనే శ్రీనివాసరావు కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి చొరబడి, మెయిన్ ఇనుప గేటు తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. పడక గదిలోని బీరువా తెరిచి, అందులో పెట్టిన 43 కాసుల బంగారం, 35 తులాల వెండి వస్తువులు తస్కరించారు. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ.రాజశేఖరరావు, రంగంపేట ఏఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అలాగే శ్రీనివాసరావు ఇంటి పక్కనే ఉంటున్న కుసుమంచి రాజేష్ కిరాణా షాపులో కూడా టేబుల్ సొరుగులను దొంగలు పగులగొట్టారు. అందులో డబ్బు లేకపోవడంతో వెళ్లిపోయారు. సీఐ రాజశేఖరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement