గొంతులో గరళం
గొంతులో గరళం
Published Sun, Mar 5 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
ఆకివీడు : మంచినీటి రూపంలో గ్రామీణుల గొంతులోకి గరళం వెళుతోంది. శుద్ధిచేసిన 20 లీటర్ల నీటిని రూ.2కే అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం సుజల స్రవంతి మంచినీటి పథకాలను నెలకొల్పుతున్నట్టు హడావుడి చేసింది. అప్పటికే పనిచేస్తున్న నీటి శుద్ధి ప్లాంట్లను స్వాధీనం చేసుకుని ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట బోర్డులు పెట్టి చేతులు దులిపేసుకుంది. జిల్లాలో 250 ప్లాంట్లకు ఇలాంటి బోర్డులు పెట్టారు. వాటి నిర్వహణను గాలికొదిలేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో వారు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం సుజల ప్లాంట్ల పేరిట గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గ్రామాల్లోని మంచినీటి చెరువులు, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్)ల నిర్వహణను గాలికొదిలేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు సుజల ప్లాంట్లలో అధిక ధరలు వెచ్చించి నీటిని కొనుక్కోలేక.. పంచాయతీల ద్వారా సరఫరా అయ్యే కలుషిత నీటిని తాగలేక అవస్థలు పడుతున్నారు.
ఇసుక ఇక్కట్లు..
గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో జిల్లాలోని 908 గ్రామాల్లో 441 మంచినీటి చెరువులు, 2,111 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు ఉన్నాయి. చెరువుల్లోని నీటిని శుద్ధి చేసేందుకు 880 ఫిల్డర్ బెడ్స్ ఉన్నాయి. నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్టర్ బెడ్స్‌లో 6 నెలలకు ఒకసారి ఇసుకను మార్చాల్సి ఉంటుంది. అయితే, మంచినీటిని శుద్ధి చేసేందుకు ఇసుక సరఫరా కావడం లేదు. ఇసుక సరఫరాలో గడచిన మూడేళ్లుగా అలసత్వం వహిస్తుండటంతో శుద్ధికాని కలుషిత నీటినే ప్రజలు తాగాల్సి వస్తోంది.
తినేస్తున్నారు
ఫిల్టర్ బెడ్స్ నుంచి తొలగించిన ఇసుకను ఒకసారి శుభ్రపరచి తిరిగి వాటిలో పోస్తుంటారు. ఇసుక సరఫరా కాకపోవడంతో ఇసుక మార్పిడి వ్యవహారం మాయగా మారిపోయింది. లక్షలాది రూపాయలను బిల్లుల రూపంలో దం డుకుంటున్నా.. ఫిల్టర్ బెడ్స్‌లో ఇసుక వేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క ఫిల్టర్ బెడ్‌లో 2నుంచి 4 టన్నుల ఇసుక వేయాల్సి వస్తుంది. ఏ ఫిల్టర్ బెడ్‌లో ఇసుక మారుస్తున్నారో, దేనిలో పాత ఇసుకను తిరిగి వినియోగిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా వీటి నిర్వహణ ప్రజలను రోగాల పాలు చేస్తోంది.
నిధులు కేటాయించాలి
ఆదాయాలు లేని పంచాయతీలకు ఫిల్టర్ బెడ్స్‌లో వాడే ఇసుక కొనుగోలుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయి. మూడు నెలలుగా ఇసుక కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నాం. అత్యవసర విభాగంగా గుర్తించి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. సుజల స్రవంతి పథకం కూడా పనిచేయడం లేదు. చెరువులు కూడా అదే దుస్థితిలో ఉన్నాయి.– గురుదాసు సీతాబాలాజీ, సర్పంచ్, చినమిల్లిపాడు, ఆకివీడు మండలం
గ్రామాలదే బాధ్యత
పంచాయతీల పరిధిలోని ఫిల్టర్ బెడ్స్ నిర్వహణ బాధ్యత పంచాయతీలదే. ఇసుక మార్చుకునేందుకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలి. లేకపోతే మండల పరిషత్ గ్రాంట్ నుంచి తీసుకోవచ్చు.– బి.గిరి, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్, భీమవరం
Advertisement
Advertisement