మేలుకొలుపు పాదయాత్రకు భారీ స్పందన
– వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి వద్ద గ్రామీణులు సమస్యల ఏకరవు
యల్లనూరు / పుట్లూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికివదిలేసిన టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు, గ్రామీణులను జాగృతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన వస్తోంది. కార్యక్రమంలోభాగంగా ఆమె శనివారం యల్లనూరు మండలంలోని అచ్యుతాపురం, వాసాపురం, బొప్పేపల్లి, పుట్లూరు మండలంలోని కొండుగారికుంట, కొత్తపల్లి, కుమ్మనమల, చాలవేముల క్రాస్, మడ్డిపల్లి గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. తాడిపత్రి సమన్వయ కర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ సమస్యలపై మండుటెండలో పాదయాత్ర చేపడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరిస్తూ హారతులు, పసుపు కుంకుమలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
కష్టాల ఏకరువు..
యల్లనూరు మండలం బొప్పేపల్లిలో పలువురు గ్రామస్తులు పద్మావతి వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. శారద అనే మహిళ మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు రూ.2500 వసూలు చేశారని, ఇప్పటివరకూ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకరోజు మాత్రమే రేషన్ ఇచ్చి, అయిపోయిందని చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పాఠశాల పైకప్పు పడిపోయి మూడు సంవత్సరాలు అయిందని, ఎంఎల్‌ఏ యామినీబాల వచ్చి మూడుసార్లు పాఠశాలను పరిశీలించినా నూతన భవనాన్ని నిర్మించలేదున్నారు. కొండుగారికుంటలో తాగునీటి సమస్య ఉండగా కేవలం రెండు ట్యాంకర్ల నీరు మాత్రమే అందిస్తున్నారని మహిళలు వాపోయారు. గుంతల్లోని నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపం పథకం కింద కేవలం రూ.950లకు గ్యాస్ కనెక‌్షన్ ఇవ్వాల్సి ఉండగా రూ.1250 వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు.
బొప్పేపల్లి చెరువుకు నీరు అందించాలి..
– సుబ్బరాయసాగర్ నుంచి 29వ డ్రిస్టిబ్యూటర్ ద్వారా బొప్పేపల్లి చెరువుకు నీటిని సరఫరా చేయాలని జొన్నలగడ్డ పద్మావతి డిమాండ్ చేశారు. బొప్పేపల్లి చెరువుకు నీరు చేరితే ఓబుళాపురం, కడవకల్లు, చెర్లోపల్లి, మడ్డిపల్లి, చాలవేముల, కుమ్మనమల, రంగరాజుకుంట, కొండుగారికుంట గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కుమ్మనమల ప్రాథమికోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల సమస్యలను తీర్చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిప్రసాద్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శులు రామాంజులరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యువజన కన్వీనర్ రామాంజులరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ నాగేష్, ఎంపీటీసీ లక్ష్మిదేవి, సర్పంచ్‌లు రామక్రిష్ణారెడ్డి, దశ్యుంతుల, విజయభాస్కర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, నాయకులు రామాంజులరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.