melukolupu padayatra
-
శింగనమలకు ఏం చేశారో చెప్పండి?
- ఎస్సీ ఓట్లతో గెలిచి వారి సంక్షేమానికి పాతరేస్తున్న శమంతకమణి, యామినీబాల - రైతులకు అర టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వలేని చేతగాని ప్రజాప్రతినిధులు - వీళ్ల తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు చేసి పాదయాత్రను ఆపేస్తారట - కాంట్రాక్టు పనులను కమీషన్లకు అమ్ముకునే వీరు నా గురించి మాట్లాడటమా? -పాదయాత్ర ముగింపు సభలో జొన్నలగడ్డ పద్మావతి ధ్వజం - పాదయాత్ర ముగించాం.. దమ్ముంటే టీడీపీ నేతలు రండి : మాజీ ఎంపీ అనంత - చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది : ఎమ్మెల్యే విశ్వ - ఘనంగా ముగిసిన పాదయాత్ర.. పద్మావతిని అక్కున చేర్చుకున్న ఆరు మండలాల ప్రజలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ‘స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ యామినీబాల ఎస్సీల ఓట్లతో గెలిచారు. ఆమె తల్లి శమంతకమణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తల్లీకూతుళ్లు ఈ మూడేళ్లలో ఎస్సీలకు ఏ ఒక్క మేలైనా చేశారా? కాంట్రాక్టు పనులు వస్తే కమీషన్లకు అమ్ముకుంటున్నారు. అవినీతి డబ్బులకు కక్కుర్తి పడుతున్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేరు. కలుషితనీరు తాగి కిడ్నీలు పాడవుతున్న పుట్లూరు, యల్లనూరు మండలాల గురించి పట్టించుకోవడం లేదు. ఈ మూడేళ్లులో నియోజకవర్గానికి గానీ, ఎస్సీలకు కానీ ఫలానా మేలు చేశామని దమ్ముంటే చెప్పండి’ అని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి సవాల్ విసిరారు. ‘మేలుకొలుపు’ పేరుతో గత నెల 26న యల్లనూరులో చేపట్టిన పాదయాత్ర శనివారం గార్లదిన్నెలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. పద్మావతి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర ఆపాలని, నన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం, పోలీసులు చూశారు. ఎందుకని ప్రశ్నిస్తే నేను ప్రజలను రెచ్చగొట్టానని అంటున్నారు. వ్యవసాయానికి నీళ్లిచ్చారా? రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణం మాఫీ అయిందా? ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చారా? అని అడిగితే రెచ్చగొట్టినట్టా?! మీరు చేసిన వెధవ పనులకు ప్రజలు ఎప్పుడో రెచ్చిపోయి ఉన్నారు. ఎన్నికలొస్తే ఏస్థాయిలో రెచ్చిపోతారో మీరే చూస్తారు. తరిమెలలో నన్ను అరెస్టు చేయాలనుకున్నారు. గ్రామంలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తరలివచ్చి అడ్డుగా నిలిచారు. అలాగే యాత్రను నిర్వీర్యం చేయాలని ప్రతి గ్రామంలో మాకంటే ముందుగానే పోలీసులు వెళ్లి ప్రజలను భయపెట్టారు. అయినా ప్రజలు తరలివచ్చారు. యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 9 రోజులను నా జీవితంలో మరవలేను. హెచ్చెల్సీ కింద 1 నుంచి 9 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. మూడేళ్లలో ఒక్కసారైనా నీళ్లివ్వలేదు. శింగనమలకు అర టీఎంసీ ఇస్తే రైతులు బతుకుతారని అడిగాం. కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేశాం. హెచ్చెల్సీ ఎస్ఈని, కలెక్టర్‌ను కలిశాం. కల్లూరు వద్ద హైవేపై ధర్నా చేశాం. అయినా చుక్కనీరు ఇచ్చిన పాపాన పోలేదు. సుబ్బరాయసాగర్ నుంచి పుట్లూరు, యల్లనూరుకు తాగునీరు కూడా ఇవ్వలేద’ని పద్మావతి వివరించారు. నేను సంపూర్ణ ఎస్సీని కాదట ‘నేను రెడ్డి కులస్తుణ్ని చేసుకున్నందుకు సంపూర్ణ ఎస్సీని కాదంటున్నారు. ఎస్సీలు దైవంగా భావించే అంబేడ్కర్ భార్య అస్వస్థతతో చనిపోతే బ్రాహ్మణ మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన సంపూర్ణ ఎస్సీ కాదా?’ అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఎïస్సీలకు ఉచితంగా కరెంటు వచ్చేదని, ఇప్పుడు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. యాత్రను ముగించాం..దమ్ముంటే రండి - వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. యాత్రను ఆపకపోతే బదిలీ చేయిస్తామని డీఎస్పీని బెదిరించారు. యాత్ర ముగించాం. గార్లదిన్నెలో ఉన్నాం. దమ్ముంటే వచ్చి అడ్డుకోండి. ఎమ్మెల్యేగా యామినీబాల, ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారు? యాడికి కాలువకు నీళ్లివ్వకపోగా ఇప్పుడు రూ.600కోట్లు దోపిడీ చేసేందుకు దివాకర్‌రెడ్డి సిద్ధమయ్యారు. కరువు పేరు చెప్పి అనంతపురానికి వందలకోట్ల పనులు మంజూరు చేయించి దోపిడీ చేస్తూ శవాలపై చిల్లర ఏరుకునేలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 267 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జూన్ నుంచే 68 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. జిల్లాకు నీటి సమస్య తీర్చకుండా నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తే సూదులతో గుచ్చి నిద్రలేపుతాం. బాబు అవినీతిలో కూరుకుపోయారు - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది. అవినీతిలో చంద్రబాబు పీకల్లోతు మునిగిపోయారు. చివరకు తన మనవడికి ‘అ’అంటే అమరావతి, ‘ఆ’ అంటే ఆదాయం అని అక్షరాభ్యాసం చేయించి ఇప్పటి నుంచే ఆదాయమార్గాలు నేర్పుతున్నారు. ఏక్షణం ఎన్నికలొచ్చినా చంద్రబాబు ప్రభుత్వ పతనం తథ్యం. ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నవ నిర్మాణ దీక్షలకు జనాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. కరువు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ – శంకరనారాయణ, జిల్లా అధ్యక్షులు చంద్రబాబు కరువు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఆయన గత 9 ఏళ్ల పాలనలో కరువు చూశాం. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో 60 ఏళ్లుగా లేని డొక్కల కరువు ఈ ఏడాది కనిపిస్తోంది. 2019లోపు ఏమి చేస్తాననేది చెప్పకుండా 2022, 2050లో ఏదో చేస్తానని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. ఒక్క హామీ అమలు కాలేదు – మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఎన్నికల ముందు సుమారు 600 హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీనీ అమలు చేయలేదు. జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎంతసేపూ ప్రతి పక్షాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. వైఎస్ హయాంలో లబ్ధి పొందని వారున్నారా? – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారు. జిల్లాలో లబ్ధి పొందని కుటుంబాన్ని చూపిస్తే నేను జిల్లా విడిచి వెళ్లిపోతా. పాలనంటే అలా ఉండాలి. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు వద్ద రెడ్లను జేసీ దివాకర్‌రెడ్డి తాకట్టు పెట్టాడు. పద్మావతిని గెలిపిస్తే 80 వేల ఎకరాలకు నీరు – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త వచ్చే ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతిని గెలిపిస్తే శింగనమల నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. వైఎస్ పథకాలతో గతంలో ఎమ్మెల్సీ శమంతకమణి కుటుంబం కూడా లబ్ధి పొందింది. పోలీసులు రౌడీలు, ఫ్యాక్షనిస్టులపై చర్యలు తీసుకోవాలి కాని గుంటనక్క చంద్రబాబు మాటలు విని సమస్యలు సృష్టించొద్దు. వారి కుటుంబాన్ని లోకలైజేషన్ చేసుకున్నారు – పెన్నోబులేసు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తనను ఎమ్మెల్యే చేస్తే శింగనమల చెరువును లోకలైజేషన్ చేసి ఏడాదికి రెండు పంటలకు నీళ్లిస్తామని చెప్పిన యామినీబాల...చెరువు సంగతి దేవుడికెరుక ఆమె ఇంటిని మాత్రం లోకలైజేషన్ చేసుకున్నారు. తనకు విప్, తల్లికి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. దళితబిడ్డ జొన్నలగడ్డ పద్మావతి మంచి మనసుతో పాదయాత్ర చేపట్టారు. ఆమెను ఆశీర్వదిస్తూ పాదయాత్ర వెంటే వర్షం కురిసింది. వచ్చే ఎన్నికల్లో ఆమెను గెలిపించేందుకు దళితులు సిద్ధం కావాలి. ప్రతి గ్రామంలోనూ వలసలు వెళ్లారు – శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర కరువు నెలకొంది. ఉపాధి లేక ప్రతి గ్రామంలోనూ వలసలు వెళ్లారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఇవేవీ జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనిపించలేదా? -
అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
- కొనసాగుతున్న మేలుకొలుపుయాత్ర - పద్మావతితో తమగోడును వెల్లబోసుకుంటున్న జనం శింగనమల : ‘మీరు ఎన్నికల్లోనూ తిరిగారు, ఇప్పడు మా సమస్యలు నెరవేర్చడానికి తిరుగుతున్నారు. మా ఓట్లు మీకేవేస్తాం... శింగనమల చెరువుకు నీరు విడిపించి మమ్మల్ని ఆదుకోండి.. ఇప్పడున్న ఎమ్మెల్యే యామినీబాల మాదిరి మోసం చేయొద్దు ’ అని శింగనమలోని బోయవీధికి చెందిన మహిళలు మేలుకొలుపు పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతికి విన్నవించుకున్నారు. ఆరో రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం కొర్రపాడు నుంచి మొదలైన పాదయాత్ర మరువకొమ్మ క్రాస్, శింగనమల, గోవిందరాయునిపేట క్రాస్, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామం వరకు సాగింది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామ గ్రామానా జొన్నలగడ్డ పద్మావతికి జనం ఘన స్వాగతం పలికారు. పద్మావతి దృష్టికి సమస్యలు కొర్రపాడు – శింగనమల మరువకొమ్మక్రాస్ మధ్యలో ఉపాధి హమీ పనులు చేస్తున్న శివపురం కూలీలను పద్మావతి పలకరించారు. కూలీ సక్రమంగా వస్తోందా అని కూలీలను పద్మావతి ప్రశ్నిచంగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎండిపోయిన శింగనమల చెరువును పరిశీలించి , మత్స్యకారులతో వారి సాధకబాధలను విన్నారు. శింగనమల చెరువుకు నీళ్లు విడిపించి ఆదుకోవాలని వారు వినతిపత్రం సమర్పించారు. అక్కడే చిన్నజలాపురానికి చెందిన బండి శ్రీనివాసులు కుమార్తె సాయివర్షిణి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్‌చేయించారు. శింగనమలలో ఎమ్మార్వో కార్యాలయం కాలనీలో తాగునీరురాక ఇబ్బంది పడుతున్నామని మహిళలు వాపోయారు. సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామాల్లోనూ మహిళలు, ప్రజలు పద్మావతికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ అంజన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటప్ప, ఈశ్వరమ్మ, ఆంజినేయులు, ఆదినారాయణ, వెంకటరమణ, డేగల ఓబిలేసు, మదన్‌మోహన్‌రెడ్డి, మహిళ విభాగం నాయకురాలు శకుంతలమ్మ, చెన్నమ్మలు పాల్గొన్నారు. -
మేలుకొలుపునకు జన స్పందన
బుక్కరాయసముద్రం (శింగనమల) : గ్రామాల్లో çరైతులు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వానికి కళ్లు తెరపించడానికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజక వర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన లభిస్తోంది. మంగళవారం ఐదో రోజు చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి, వెంకటాపురం క్రాస్, చెన్నంపల్లి, నీలారెడ్డిపల్లి, కొర్రపాడు గ్రామాల్లో కొనసాగించారు. ఈపాదయాత్రలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, గుంతకల్లు నియోజక వర్గం సమన్వయకర్త వైటీ వెంకటరామిరెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజినేయులు పాల్గొన్నారు. అడుగడుతునా పద్మావతికి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పద్మావతి దృష్టికి సమస్యలు.. బొమ్మలాటపల్లి పల్లి నుంచి పాదయాత్ర మొదలువుతూనే ఉపాధి కూలీలు బిల్లులు రాలేదని మొరపెట్టుకున్నారు. చెన్నంపల్లిలో పింఛన్లు రాలేదని, తాగునీటి సమస్య ఉందని ప్రజలు తెలిపారు. హెచ్చెల్సీ కాలువకు నీరు వదలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వివరించారు. అక్కడి నుంచి నీలారెడ్డిపల్లికి బయలుదేరగా, మధ్యలో నాసిరకంగా నిర్మించిన పనులు పరిశీలించారు. ఉపాధి పనులు చేసి వస్తున్న కూలీలతో మాట్లాడుతూ బిల్లులు సక్రమంగా అందడం లేదన్నారు. కూలీ రోజుకు రూ.100 మాత్రమే వస్తోందని కూలీలు ఆమెకు తెలిపారు. మిరప పంటను గొర్రెలకు వదిలేయడంతో పంటను పరిశీలించారు. భూగర్భజలం తగ్గిపోయి బోరులో నీరు రాకపోవడంతో మిరపపంటను గొర్రెలకు వదిలేశారని వివరించారు. నీలారెడ్డిపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో రైతు పుల్లారెడ్డికి చెందిన ఎండిన అరటి తోటను పరిశీలించారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా అని పద్మావతి రైతును ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని రైతు వాపోయాడు. కార్యక్రమంలో మండల ఎంపీపీ సాకే ఆదిలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘం సొసైటీ మండల అధ్యక్షులు నాగలింగారెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అద్యక్షులు సాకే రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చేర్మెన్ ముసలన్న, మాజీ మండల కన్వీనర్లు సుధాకర్‌రెడ్డి, లక్ష్మిన్న, ఎంపీటీసీ మల్లయ్య, సురేష్, జిల్లా మహిళా కార్యదర్శి కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ కాదు సోమాలియా చేస్తున్నారు
-
మేలుకొలుపులో సమస్యల ఏకరువు
- జొన్నలగడ్డ పద్మావతికి హారతులతో స్వాగతం మడ్డిపల్లి (శింగనమల) : నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వారిని జాగృతం చేసేందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు మూడవరోజు కార్యక్రమానికి గ్రామీణుల నుంచి భారీ స్పందన లభించింది. వారు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మేలుకొలుపు పాదయాత్ర ఆదివారం పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి, జంగంరెడ్డిపేట, మడుగుపల్లి గ్రామాల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పద్మావతికి హారతులు, పసుపు కుంకుమలతో స్వాగతం పలికారు. సుబ్బరాయసాగర్ నుంచి 29వ డిస్ట్రిబ్యూటరీకి హెచ్ఎల్సీ నీరు వదిలేలా చేసి అదుకోవాలని రైతులు కోరారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు పింఛన్లు, రుణాలు రాకుండా పోతున్నాయని లబ్ధిదారులు ఆవేదన చెందారు. ఎస్సీలకు కూడా జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే రుణాలు మంజూరు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేని, రుణాలకు వడ్డీరాయితీ కూడా రాలేదని, రూ.2ల వడ్డీ పడుతోందని మహిళలు వాపోయారు. మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నా అధికారులు ఉపాధి పనులు కల్పించడం లేదని జంగంరెడ్డిపేట కూలీలు పద్మావతి దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఓబిలేసు, పార్టీ మండల కన్వీనరు భూమిరెడ్డి రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు వెంకట్రామిరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రామాంజులరెడ్డి, పార్టీ ఐటీ వింగ్ బెంగళూరుకు చెందిన నాయకులు, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఎం మద్దతు మేలుకొలుపు పాదయాత్రకు సీపీఎం శింగనమల నియోజకవర్గ కార్యదర్శి బాలరంగయ్యతోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. జంగంరెడ్డిపేట వద్ద పద్మావతిని కలిశారు. -
మేలుకొలుపు పాదయాత్రకు భారీ స్పందన
– వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి వద్ద గ్రామీణులు సమస్యల ఏకరవు యల్లనూరు / పుట్లూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికివదిలేసిన టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు, గ్రామీణులను జాగృతం చేసేందుకు వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన వస్తోంది. కార్యక్రమంలోభాగంగా ఆమె శనివారం యల్లనూరు మండలంలోని అచ్యుతాపురం, వాసాపురం, బొప్పేపల్లి, పుట్లూరు మండలంలోని కొండుగారికుంట, కొత్తపల్లి, కుమ్మనమల, చాలవేముల క్రాస్, మడ్డిపల్లి గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. తాడిపత్రి సమన్వయ కర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ సమస్యలపై మండుటెండలో పాదయాత్ర చేపడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరిస్తూ హారతులు, పసుపు కుంకుమలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కష్టాల ఏకరువు.. యల్లనూరు మండలం బొప్పేపల్లిలో పలువురు గ్రామస్తులు పద్మావతి వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. శారద అనే మహిళ మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు రూ.2500 వసూలు చేశారని, ఇప్పటివరకూ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకరోజు మాత్రమే రేషన్ ఇచ్చి, అయిపోయిందని చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పాఠశాల పైకప్పు పడిపోయి మూడు సంవత్సరాలు అయిందని, ఎంఎల్ఏ యామినీబాల వచ్చి మూడుసార్లు పాఠశాలను పరిశీలించినా నూతన భవనాన్ని నిర్మించలేదున్నారు. కొండుగారికుంటలో తాగునీటి సమస్య ఉండగా కేవలం రెండు ట్యాంకర్ల నీరు మాత్రమే అందిస్తున్నారని మహిళలు వాపోయారు. గుంతల్లోని నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపం పథకం కింద కేవలం రూ.950లకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా రూ.1250 వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు. బొప్పేపల్లి చెరువుకు నీరు అందించాలి.. – సుబ్బరాయసాగర్ నుంచి 29వ డ్రిస్టిబ్యూటర్ ద్వారా బొప్పేపల్లి చెరువుకు నీటిని సరఫరా చేయాలని జొన్నలగడ్డ పద్మావతి డిమాండ్ చేశారు. బొప్పేపల్లి చెరువుకు నీరు చేరితే ఓబుళాపురం, కడవకల్లు, చెర్లోపల్లి, మడ్డిపల్లి, చాలవేముల, కుమ్మనమల, రంగరాజుకుంట, కొండుగారికుంట గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కుమ్మనమల ప్రాథమికోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల సమస్యలను తీర్చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిప్రసాద్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శులు రామాంజులరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యువజన కన్వీనర్ రామాంజులరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ నాగేష్, ఎంపీటీసీ లక్ష్మిదేవి, సర్పంచ్‌లు రామక్రిష్ణారెడ్డి, దశ్యుంతుల, విజయభాస్కర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, నాయకులు రామాంజులరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.