శింగనమలకు ఏం చేశారో చెప్పండి?
- ఎస్సీ ఓట్లతో గెలిచి వారి సంక్షేమానికి పాతరేస్తున్న శమంతకమణి, యామినీబాల
- రైతులకు అర టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వలేని చేతగాని ప్రజాప్రతినిధులు
- వీళ్ల తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు చేసి పాదయాత్రను ఆపేస్తారట
- కాంట్రాక్టు పనులను కమీషన్లకు అమ్ముకునే వీరు నా గురించి మాట్లాడటమా?
-పాదయాత్ర ముగింపు సభలో జొన్నలగడ్డ పద్మావతి ధ్వజం
- పాదయాత్ర ముగించాం.. దమ్ముంటే టీడీపీ నేతలు రండి : మాజీ ఎంపీ అనంత
- చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది : ఎమ్మెల్యే విశ్వ
- ఘనంగా ముగిసిన పాదయాత్ర.. పద్మావతిని అక్కున చేర్చుకున్న ఆరు మండలాల ప్రజలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
‘స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ యామినీబాల ఎస్సీల ఓట్లతో గెలిచారు. ఆమె తల్లి శమంతకమణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తల్లీకూతుళ్లు ఈ మూడేళ్లలో ఎస్సీలకు ఏ ఒక్క మేలైనా చేశారా? కాంట్రాక్టు పనులు వస్తే కమీషన్లకు అమ్ముకుంటున్నారు. అవినీతి డబ్బులకు కక్కుర్తి పడుతున్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేరు. కలుషితనీరు తాగి కిడ్నీలు పాడవుతున్న పుట్లూరు, యల్లనూరు మండలాల గురించి పట్టించుకోవడం లేదు. ఈ మూడేళ్లులో నియోజకవర్గానికి గానీ, ఎస్సీలకు కానీ ఫలానా మేలు చేశామని దమ్ముంటే చెప్పండి’ అని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి సవాల్ విసిరారు. ‘మేలుకొలుపు’ పేరుతో గత నెల 26న యల్లనూరులో చేపట్టిన పాదయాత్ర శనివారం గార్లదిన్నెలో ముగిసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. పద్మావతి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర ఆపాలని, నన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం, పోలీసులు చూశారు. ఎందుకని ప్రశ్నిస్తే నేను ప్రజలను రెచ్చగొట్టానని అంటున్నారు. వ్యవసాయానికి నీళ్లిచ్చారా? రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణం మాఫీ అయిందా? ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చారా? అని అడిగితే రెచ్చగొట్టినట్టా?! మీరు చేసిన వెధవ పనులకు ప్రజలు ఎప్పుడో రెచ్చిపోయి ఉన్నారు. ఎన్నికలొస్తే ఏస్థాయిలో రెచ్చిపోతారో మీరే చూస్తారు. తరిమెలలో నన్ను అరెస్టు చేయాలనుకున్నారు. గ్రామంలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తరలివచ్చి అడ్డుగా నిలిచారు. అలాగే యాత్రను నిర్వీర్యం చేయాలని ప్రతి గ్రామంలో మాకంటే ముందుగానే పోలీసులు వెళ్లి ప్రజలను భయపెట్టారు. అయినా ప్రజలు తరలివచ్చారు. యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ 9 రోజులను నా జీవితంలో మరవలేను. హెచ్చెల్సీ కింద 1 నుంచి 9 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. మూడేళ్లలో ఒక్కసారైనా నీళ్లివ్వలేదు. శింగనమలకు అర టీఎంసీ ఇస్తే రైతులు బతుకుతారని అడిగాం. కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేశాం. హెచ్చెల్సీ ఎస్‌ఈని, కలెక్టర్‌ను కలిశాం. కల్లూరు వద్ద హైవేపై ధర్నా చేశాం. అయినా చుక్కనీరు ఇచ్చిన పాపాన పోలేదు. సుబ్బరాయసాగర్ నుంచి పుట్లూరు, యల్లనూరుకు తాగునీరు కూడా ఇవ్వలేద’ని పద్మావతి వివరించారు.
నేను సంపూర్ణ ఎస్సీని కాదట
‘నేను రెడ్డి కులస్తుణ్ని చేసుకున్నందుకు సంపూర్ణ ఎస్సీని కాదంటున్నారు. ఎస్సీలు దైవంగా భావించే అంబేడ్కర్ భార్య అస్వస్థతతో చనిపోతే బ్రాహ్మణ మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన సంపూర్ణ ఎస్సీ కాదా?’ అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఎïస్సీలకు ఉచితంగా కరెంటు వచ్చేదని, ఇప్పుడు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు.
యాత్రను ముగించాం..దమ్ముంటే రండి - వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి
పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. యాత్రను ఆపకపోతే బదిలీ చేయిస్తామని డీఎస్పీని బెదిరించారు. యాత్ర ముగించాం. గార్లదిన్నెలో ఉన్నాం. దమ్ముంటే వచ్చి అడ్డుకోండి. ఎమ్మెల్యేగా యామినీబాల, ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారు? యాడికి కాలువకు నీళ్లివ్వకపోగా ఇప్పుడు రూ.600కోట్లు దోపిడీ చేసేందుకు దివాకర్‌రెడ్డి సిద్ధమయ్యారు. కరువు పేరు చెప్పి అనంతపురానికి వందలకోట్ల పనులు మంజూరు చేయించి దోపిడీ చేస్తూ శవాలపై చిల్లర ఏరుకునేలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 267 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జూన్ నుంచే 68 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. జిల్లాకు నీటి సమస్య తీర్చకుండా నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తే సూదులతో గుచ్చి నిద్రలేపుతాం.
బాబు అవినీతిలో కూరుకుపోయారు - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది. అవినీతిలో చంద్రబాబు పీకల్లోతు మునిగిపోయారు. చివరకు తన మనవడికి ‘అ’అంటే అమరావతి, ‘ఆ’ అంటే ఆదాయం అని అక్షరాభ్యాసం చేయించి ఇప్పటి నుంచే ఆదాయమార్గాలు నేర్పుతున్నారు. ఏక్షణం ఎన్నికలొచ్చినా చంద్రబాబు ప్రభుత్వ పతనం తథ్యం. ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నవ నిర్మాణ దీక్షలకు జనాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనం.
కరువు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ – శంకరనారాయణ, జిల్లా అధ్యక్షులు
చంద్రబాబు కరువు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఆయన గత 9 ఏళ్ల పాలనలో కరువు చూశాం. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో 60 ఏళ్లుగా లేని డొక్కల కరువు ఈ ఏడాది కనిపిస్తోంది. 2019లోపు ఏమి చేస్తాననేది చెప్పకుండా 2022, 2050లో ఏదో చేస్తానని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు.
ఒక్క హామీ అమలు కాలేదు – మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి
ఎన్నికల ముందు సుమారు 600 హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీనీ అమలు చేయలేదు. జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎంతసేపూ ప్రతి పక్షాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు.
వైఎస్ హయాంలో లబ్ధి పొందని వారున్నారా? – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త
వైఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారు. జిల్లాలో లబ్ధి పొందని కుటుంబాన్ని చూపిస్తే నేను జిల్లా విడిచి వెళ్లిపోతా. పాలనంటే అలా ఉండాలి. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు వద్ద రెడ్లను జేసీ దివాకర్‌రెడ్డి తాకట్టు పెట్టాడు.
పద్మావతిని గెలిపిస్తే 80 వేల ఎకరాలకు నీరు – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త
వచ్చే ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతిని గెలిపిస్తే శింగనమల నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. వైఎస్ పథకాలతో గతంలో ఎమ్మెల్సీ శమంతకమణి కుటుంబం కూడా లబ్ధి పొందింది. పోలీసులు రౌడీలు, ఫ్యాక‌్షనిస్టులపై చర్యలు తీసుకోవాలి కాని గుంటనక్క చంద్రబాబు మాటలు విని సమస్యలు సృష్టించొద్దు.
వారి కుటుంబాన్ని లోకలైజేషన్ చేసుకున్నారు – పెన్నోబులేసు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు
తనను ఎమ్మెల్యే చేస్తే శింగనమల చెరువును లోకలైజేషన్ చేసి ఏడాదికి రెండు పంటలకు నీళ్లిస్తామని చెప్పిన యామినీబాల...చెరువు సంగతి దేవుడికెరుక ఆమె ఇంటిని మాత్రం లోకలైజేషన్ చేసుకున్నారు. తనకు విప్, తల్లికి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. దళితబిడ్డ జొన్నలగడ్డ పద్మావతి మంచి మనసుతో పాదయాత్ర చేపట్టారు. ఆమెను ఆశీర్వదిస్తూ పాదయాత్ర వెంటే వర్షం కురిసింది. వచ్చే ఎన్నికల్లో ఆమెను గెలిపించేందుకు దళితులు సిద్ధం కావాలి.
ప్రతి గ్రామంలోనూ వలసలు వెళ్లారు – శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర కరువు నెలకొంది. ఉపాధి లేక ప్రతి గ్రామంలోనూ వలసలు వెళ్లారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఇవేవీ జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనిపించలేదా?