
సాక్షి, అనంతపురం: వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్.. ఇవన్నీ యువతకు సుపరిచితమే. ఇదే తరహాలో ఇప్పుడు కొత్తగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటారా? ఇది మేడ్ ఇన్ ఆంధ్రా. ఇంకా చెప్పాలంటే.. మేడ్ ఇన్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి ఈ ‘లవ్‌చాట్’ మెసేజింగ్ యాప్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం విలేకరులకు వెల్లడించాడు. సాయికుమార్ నాన్న శేఖర్, అమ్మ నాగలక్ష్మి. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అతను శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాళసముద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై సాయికుమార్‌కు ఆసక్తి ఎక్కువ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటేషనల్ థింకింగ్ ఉపాధ్యాయుడు త్యాగేశ్వర్ నాయక్ మార్గదర్శకత్వంలో appinventor.mit.edu అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని యువతకు ఆకర్షణగా ‘లవ్‌చాట్’ అనే యాప్‌ను సాయికుమార్ రూపొందించాడు. 5 సార్లు ప్రయత్నించి విఫలమైన తర్వాత 6వ సారి యాప్ రూపకల్పనలో విజయవంతమయ్యాడు.
ఇది మెసెంజర్ యాప్‌గా పని చేస్తుంది. వాట్సాప్ మాదిరిగానే లవ్‌చాట్‌లోనూ స్నేహితులు, బంధువులతో చాటింగ్, ఫొటో షేరింగ్, ఫోన్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు లవ్‌చాట్ యాప్‌ను 150 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. https://appsgeyser. com/15260267 అనే లింకు ద్వారా గూగుల్ క్రోమ్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.