చెన్నమ్మ
రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి నాలుగు రాళ్లు చేతిలో పడితే.. ఆ డబ్బుతో వండివార్చిన పచ్చడి మెతుకులైనా పరమాన్నం తిన్నట్లే ఉంటుంది. ఈ మనసు ఎందరికుంటుంది? అన్ని అవయవాలూ బాగున్నా.. రోడ్ల వెంట చేయి చాస్తున్న మనుషులు నిత్యం తారసపడుతుంటారు. ఇదే సమయంలో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులకూ ఇవే రోడ్లు ఆశ్రయం. ఊరికే డబ్బు వస్తుందంటే ఎవరికి చేదు అనుకుంటాం. కానీ 90 ఏళ్లు పైబడిన ఆ అవ్వకు తనది కాని ఒక్క రూపాయి కూడా పాముతో సమానం. అయినవాళ్లకు ఆమె అక్కరకు రానిదైనా.. జానెడు పొట్ట నింపుకునేందుకు అనాథగా రోడ్డెక్కింది. ఉంటే తింటుంది. లేదంటే పస్తులుంటుంది. ఎవరైనా జాలిపడి పదో పరకో ఇవ్వజూపితే తాను బిచ్చగత్తెను కాదని నవ్వుతూ చెబుతుంది. తాను చేయగలిగిన పని చెబితే చేస్తానని.. ఆ తర్వాత మీరు ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వండని ముందుకు కదులుతుంది. ఎండ లేదు.. వాన లేదు.. చలిగాలికీ బెదరదు.. ఫుట్‌పాత్‌పైనే బతుకీడుస్తున్న ఈ చెన్నమ్మ ఆత్మాభిమానానికి పెద్దమ్మే మరి.
గార్లదిన్నె మండలం రంగనాథపురానికి చెందిన చెన్నమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అవసాన దశలో ఉన్న చెన్నమ్మను వారు భారమనుకున్నారేమో.. పదేళ్ల క్రితం నిర్దయగా వదిలేశారు. అప్పటి వరకు ఎంతో పరువుగా బతికిన ఊళ్లో ఆమె ఇమడలేకపోయింది. ఉన్న ఊరు వదిలేసి అనంతపురానికి చేరుకుంది. బతికేందుకు రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఓ కర్రను ఊతంగా పట్టుకుని నడుస్తూ.. రోడ్డు పక్కన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ గుత్తిరోడ్డులోని ఓ గుజరీలో విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆకలిదప్పికలు తీర్చుకుంటోంది. ఎవరైనా జాలితో అన్నమో.. డబ్బో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తుంది. తనకు చేతనైనా పనిచేసిపెడతానని, అప్పుడే తనకు ఆ డబ్బు ఇవ్వాలని సూచిస్తోంది.
ఇదిగో.. టీ తాగు
చచ్చే వరకూ ఒకరిపై ఆధారపడకుండా తన రెక్కల కష్టంపైనే జీవిస్తానంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న చెన్నమ్మను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. చివరకు తనకు వస్తున్న పింఛన్‌ను బిడ్డలు లాక్కెళుతున్నా.. ఆమె నోరు మెదపడం లేదు. ఇదంతా తన ఖర్మ అంటూ కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటుంది. కొసమెరుపేమిటంటే.. తనను ఫొటోలు తీస్తుండగా గమనించిన ఆమె ఎందుకు అంటూ ఆరా తీసింది. ‘ఎండలో చాలా కష్టపడుతున్నావు నాయనా.. ఇదిగో ఈ డబ్బు తీసుకుని టీ తాగు’ అంటూ ఓ ఐదు రూపాయలు తీసి ఇవ్వజూపినప్పుడు కెమెరా కళ్లు చెమ్మగిల్లాయి.
అనంతపురంలోని గుత్తి రోడ్డులో చెత్తకుండి నుంచి వ్యర్థాలు ఏరుకుంటూ..
సేకరించిన వ్యర్థాలను గుజరీ షాపులో వేస్తున్న చెన్నమ్మ
Comments
Please login to add a commentAdd a comment