Dust particles
-
స్వచ్ఛమైన గాలికి ఎయిర్‌బాక్స్!
పీల్చే గాలి విషమవుతోంది. రుజువు కావాలా? ఒక్కసారి ఢిల్లీకెళ్లి చూడండి. ఆ సంగతి ఇప్పుడెందుకంటారా? ఫొటో చూసేయండి.. విషయం మీకే అర్థమైపోతుంది. ఫొటోలో కనిపిస్తున్నది అత్యాధునిక ఎయిర్ ఫిల్టర్. పేరు ఎయిర్‌బాక్స్. పిట్టకొంచెం కూత ఘనం అంటామే ఆ టైప్ అన్నమాట. బాత్రూముల్లోని సూక్ష్మజీవులు మొదలుకొని రసాయనిక రంగుల్లోని హానికారక కాలుస్యాల వరకూ అన్నింటినీ ఇట్టే పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అప్పుడప్పుడూ ఇందులోని ఫిల్టర్‌ను బయటకు తీసి శుభ్రం చేసుకోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. అరచేతిలో ఇమిడిపోయే ఈ ఎయిర్ ఫిల్టర్‌లోకి కలుషితాలతో కూడిన గాలి ప్రవేశించిన వెంటనే ముందుగా ఈ ఫిల్టర్ ద్వారా ప్రయాణించి పెద్దపెద్ద ధూళికణాలను తీసేస్తుంది. ఆ తరువాత ఓ యూవీ ఎల్ఈడీ లైటు సాయంతో ఓ నానో రియాక్టర్ హానికారక రసాయన కణాలను ధ్వంసం చేస్తుంది. చివరగా నెగటివ్ అయాన్ జనరేటర్ సెకనుకు రెండు కోట్ల అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది అతిసూక్ష్మమైన పిఎం 2.5 కణాలకు అతుక్కుని తొలగిస్తుంది. ప్రస్తుతం ఈ ఎయిర్బాక్స్ను తయారు చేసేందుకు అవసరమైన నిధులను కిక్‌స్టార్టర్ వేదికగా సేకరిస్తున్నారు. -
ఆత్మాభిమానికి పెద్దమ్మ
రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి నాలుగు రాళ్లు చేతిలో పడితే.. ఆ డబ్బుతో వండివార్చిన పచ్చడి మెతుకులైనా పరమాన్నం తిన్నట్లే ఉంటుంది. ఈ మనసు ఎందరికుంటుంది? అన్ని అవయవాలూ బాగున్నా.. రోడ్ల వెంట చేయి చాస్తున్న మనుషులు నిత్యం తారసపడుతుంటారు. ఇదే సమయంలో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులకూ ఇవే రోడ్లు ఆశ్రయం. ఊరికే డబ్బు వస్తుందంటే ఎవరికి చేదు అనుకుంటాం. కానీ 90 ఏళ్లు పైబడిన ఆ అవ్వకు తనది కాని ఒక్క రూపాయి కూడా పాముతో సమానం. అయినవాళ్లకు ఆమె అక్కరకు రానిదైనా.. జానెడు పొట్ట నింపుకునేందుకు అనాథగా రోడ్డెక్కింది. ఉంటే తింటుంది. లేదంటే పస్తులుంటుంది. ఎవరైనా జాలిపడి పదో పరకో ఇవ్వజూపితే తాను బిచ్చగత్తెను కాదని నవ్వుతూ చెబుతుంది. తాను చేయగలిగిన పని చెబితే చేస్తానని.. ఆ తర్వాత మీరు ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వండని ముందుకు కదులుతుంది. ఎండ లేదు.. వాన లేదు.. చలిగాలికీ బెదరదు.. ఫుట్‌పాత్‌పైనే బతుకీడుస్తున్న ఈ చెన్నమ్మ ఆత్మాభిమానానికి పెద్దమ్మే మరి. గార్లదిన్నె మండలం రంగనాథపురానికి చెందిన చెన్నమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అవసాన దశలో ఉన్న చెన్నమ్మను వారు భారమనుకున్నారేమో.. పదేళ్ల క్రితం నిర్దయగా వదిలేశారు. అప్పటి వరకు ఎంతో పరువుగా బతికిన ఊళ్లో ఆమె ఇమడలేకపోయింది. ఉన్న ఊరు వదిలేసి అనంతపురానికి చేరుకుంది. బతికేందుకు రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఓ కర్రను ఊతంగా పట్టుకుని నడుస్తూ.. రోడ్డు పక్కన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ గుత్తిరోడ్డులోని ఓ గుజరీలో విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆకలిదప్పికలు తీర్చుకుంటోంది. ఎవరైనా జాలితో అన్నమో.. డబ్బో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తుంది. తనకు చేతనైనా పనిచేసిపెడతానని, అప్పుడే తనకు ఆ డబ్బు ఇవ్వాలని సూచిస్తోంది. ఇదిగో.. టీ తాగు చచ్చే వరకూ ఒకరిపై ఆధారపడకుండా తన రెక్కల కష్టంపైనే జీవిస్తానంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న చెన్నమ్మను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. చివరకు తనకు వస్తున్న పింఛన్‌ను బిడ్డలు లాక్కెళుతున్నా.. ఆమె నోరు మెదపడం లేదు. ఇదంతా తన ఖర్మ అంటూ కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటుంది. కొసమెరుపేమిటంటే.. తనను ఫొటోలు తీస్తుండగా గమనించిన ఆమె ఎందుకు అంటూ ఆరా తీసింది. ‘ఎండలో చాలా కష్టపడుతున్నావు నాయనా.. ఇదిగో ఈ డబ్బు తీసుకుని టీ తాగు’ అంటూ ఓ ఐదు రూపాయలు తీసి ఇవ్వజూపినప్పుడు కెమెరా కళ్లు చెమ్మగిల్లాయి. అనంతపురంలోని గుత్తి రోడ్డులో చెత్తకుండి నుంచి వ్యర్థాలు ఏరుకుంటూ.. సేకరించిన వ్యర్థాలను గుజరీ షాపులో వేస్తున్న చెన్నమ్మ -
వామ్మో.. హైడర్‌బాద్..
రాజధానిలో పెరుగుతోన్న వాయు కాలుష్యం ఏడాదిలో సగం రోజులు పొల్యూషన్ కష్టాలు పండగలు, సెలవు దినాల్లో కాస్త ఉపశమనం దెబ్బతింటున్న శ్వాసకోశాలు, ముక్కుపుటాలు మహా నగరంలో వాయు కాలుష్యం బుసలు కొడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాటేస్తూ కోరలు చాస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 43 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులను కమ్మేస్తున్న దుమ్ముతో సిటీజనుల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపుమీటరు గాలిలో ధూళి కణాలు (పీఎం 10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడం ఆందోళన కలిగించే విషయం. పలు కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు గుర్తించారు. బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగానే కాలుష్య ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు తేలింది. సెలవు రోజులు, పండగ వేళలు, వర్షం పడినపుడు, ట్రాఫిక్ రద్దీ అంతగాలేని రోజుల్లో కాలుష్య తీవ్రత కాస్త తగ్గడం ఒకింత ఉపశమనం కలిగిస్తోంది. - బంజారాహిల్స్ / సాక్షి,సిటీబ్యూరో మెట్రో నగరాల్లో 16వ స్థానం.. గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా 23 నగరాల్లో కాలుష్య తీవ్రతను సర్వే చేసింది. ఇందులో హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచింది. కాలుష్య సూచీ ప్రకారం ఆ నగరాల ర్యాంకుల జాబితా ఇలా ఉంది.. 1. లక్నో, 2. ముంబాయి, 3. కోల్‌కత, 4. సూరత్, 5. జైపూర్, 6. విశాఖపట్నం, 7. గుర్గావ్, 8. లూధియానా, 9. ఢిల్లీ, 10. వడోదర, 11. చెన్నై, 12. పూణే, 13. మదురై, 14. నాగ్‌పూర్, 15. మీరట్, 16. హైదరాబాద్, 17. బెంగళూరు, 18. కోచి, 19. విజయవాడ, 20. కొయంబత్తూర్, 21. అహ్మదాబాద్, 22. నాసిక్, 23. తిరువనంతపురం. పొల్యూషన్‌కు కారణాలివే.. గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 43 లక్షలకు చేరింది. వీటికి ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతోంది. నగరంలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైకి రావడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.వాహనాల సంఖ్య లక్షలు దాటినా.. గ్రేటర్లో6,411 కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతోంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఈ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వంటి ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. జరిగే అనర్థాలివీ.. వాయు కాలుష్యంలో టోలిన్, బెంజీన్ కాలుష్యం అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఉన్నవారు క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశాలను నాశనం చేసి బ్రాంక్రైటిస్కు కారణమవుతోంది.నైట్రోజన్ డయాక్సైడ్తో కళ్లు, ముక్కు మండుతున్నాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతోంది. అమ్మోనియా మోతాదు పెరగడం వల్ల కళ్ల మంటలతో పాటు శ్వాసకోశ భాగాలన్నీ దెబ్బతింటున్నాయి. పీఎం 10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు సోకుతున్నాయి. దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది. ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.