మేలుకొలుపునకు జన స్పందన
బుక్కరాయసముద్రం (శింగనమల) : గ్రామాల్లో çరైతులు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వానికి కళ్లు తెరపించడానికి వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజక వర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన లభిస్తోంది. మంగళవారం ఐదో రోజు చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి, వెంకటాపురం క్రాస్, చెన్నంపల్లి, నీలారెడ్డిపల్లి, కొర్రపాడు గ్రామాల్లో కొనసాగించారు. ఈపాదయాత్రలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, గుంతకల్లు నియోజక వర్గం సమన్వయకర్త వైటీ వెంకటరామిరెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజినేయులు పాల్గొన్నారు. అడుగడుతునా పద్మావతికి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.
పద్మావతి దృష్టికి సమస్యలు..
బొమ్మలాటపల్లి పల్లి నుంచి పాదయాత్ర మొదలువుతూనే ఉపాధి కూలీలు బిల్లులు రాలేదని మొరపెట్టుకున్నారు. చెన్నంపల్లిలో పింఛన్లు రాలేదని, తాగునీటి సమస్య ఉందని ప్రజలు తెలిపారు. హెచ్చెల్సీ కాలువకు నీరు వదలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వివరించారు. అక్కడి నుంచి నీలారెడ్డిపల్లికి బయలుదేరగా, మధ్యలో నాసిరకంగా నిర్మించిన పనులు పరిశీలించారు. ఉపాధి పనులు చేసి వస్తున్న కూలీలతో మాట్లాడుతూ బిల్లులు సక్రమంగా అందడం లేదన్నారు. కూలీ రోజుకు రూ.100 మాత్రమే వస్తోందని కూలీలు ఆమెకు తెలిపారు. మిరప పంటను గొర్రెలకు వదిలేయడంతో పంటను పరిశీలించారు. భూగర్భజలం తగ్గిపోయి బోరులో నీరు రాకపోవడంతో మిరపపంటను గొర్రెలకు వదిలేశారని వివరించారు. నీలారెడ్డిపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో రైతు పుల్లారెడ్డికి చెందిన ఎండిన అరటి తోటను పరిశీలించారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా అని పద్మావతి రైతును ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని రైతు వాపోయాడు. కార్యక్రమంలో మండల ఎంపీపీ సాకే ఆదిలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘం సొసైటీ మండల అధ్యక్షులు నాగలింగారెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అద్యక్షులు సాకే రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చేర్మెన్ ముసలన్న, మాజీ మండల కన్వీనర్లు సుధాకర్‌రెడ్డి, లక్ష్మిన్న, ఎంపీటీసీ మల్లయ్య, సురేష్, జిల్లా మహిళా కార్యదర్శి కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.