అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
- కొనసాగుతున్న మేలుకొలుపుయాత్ర
- పద్మావతితో తమగోడును వెల్లబోసుకుంటున్న జనం
శింగనమల : ‘మీరు ఎన్నికల్లోనూ తిరిగారు, ఇప్పడు మా సమస్యలు నెరవేర్చడానికి తిరుగుతున్నారు. మా ఓట్లు మీకేవేస్తాం... శింగనమల చెరువుకు నీరు విడిపించి మమ్మల్ని ఆదుకోండి.. ఇప్పడున్న ఎమ్మెల్యే యామినీబాల మాదిరి మోసం చేయొద్దు ’ అని శింగనమలోని బోయవీధికి చెందిన మహిళలు మేలుకొలుపు పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతికి విన్నవించుకున్నారు. ఆరో రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం కొర్రపాడు నుంచి మొదలైన పాదయాత్ర మరువకొమ్మ క్రాస్, శింగనమల, గోవిందరాయునిపేట క్రాస్, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామం వరకు సాగింది. ఈ యాత్రలో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామ గ్రామానా జొన్నలగడ్డ పద్మావతికి జనం ఘన స్వాగతం పలికారు.
పద్మావతి దృష్టికి సమస్యలు
కొర్రపాడు – శింగనమల మరువకొమ్మక్రాస్ మధ్యలో ఉపాధి హమీ పనులు చేస్తున్న శివపురం కూలీలను పద్మావతి పలకరించారు. కూలీ సక్రమంగా వస్తోందా అని కూలీలను పద్మావతి ప్రశ్నిచంగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎండిపోయిన శింగనమల చెరువును పరిశీలించి , మత్స్యకారులతో వారి సాధకబాధలను విన్నారు. శింగనమల చెరువుకు నీళ్లు విడిపించి ఆదుకోవాలని వారు వినతిపత్రం సమర్పించారు. అక్కడే చిన్నజలాపురానికి చెందిన బండి శ్రీనివాసులు కుమార్తె సాయివర్షిణి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్‌చేయించారు. శింగనమలలో ఎమ్మార్వో కార్యాలయం కాలనీలో తాగునీరురాక ఇబ్బంది పడుతున్నామని మహిళలు వాపోయారు. సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామాల్లోనూ మహిళలు, ప్రజలు పద్మావతికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ అంజన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటప్ప, ఈశ్వరమ్మ, ఆంజినేయులు, ఆదినారాయణ, వెంకటరమణ, డేగల ఓబిలేసు, మదన్‌మోహన్‌రెడ్డి, మహిళ విభాగం నాయకురాలు శకుంతలమ్మ, చెన్నమ్మలు పాల్గొన్నారు.