‘ఆట’ముత్యం
-
రోలర్ స్కేటింగ్ హాకీ నుంచి ఎయిర్ రైఫిల్ షూటింగ్ వరకు
-
సత్తాచాటుతున్న నరేంద్రపురం కుర్రాడు
రోలర్ స్కేటింగ్ హాకీ, ఎయిర్ రైఫిల్ షూటింగ్ క్రీడ ఏదైనా.. అతను బరిలోకి దిగాడంటే పతకం కొట్టాల్సిందే. పదో ఏటనే తనకు ఇష్టమైన రోలర్‌స్కేటింగ్ హాకీ, స్విమ్మింగ్ విభాగాల్లో శిక్షణ పొంది ఆయా రంగాల్లో రాణించిన అతడు.. తన వ్యక్తిగత గుర్తింపు కోసం ఎయిర్ రైఫిల్ షూటింగ్‌పై ఆసక్తి కనబరిచాడు. ఆ రంగంలోనూ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తన సత్తాను చాటుతున్నాడు రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన ఈ కుర్రాడు.
– రాజానగరం
వడ్డి శ్రీనాథ్ ముత్యాలరావు. ఇతడికి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఆసక్తి. వ్యవసాయదారుడైన తండ్రి సూర్యప్రకాష్ ఇతడి ఆసక్తిని గమనించి క్రీడల్లో ప్రోత్సహించారు. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు స్థానిక కాన్వెంట్‌లో చదివిన ముత్యాలరావు ఆపై పెద్దాపురంలోని ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. అక్కడ ఇతర విద్యార్థులకు కోచ్‌లు ఇచ్చే శిక్షణను చూసి.. తాను కూడా రోలర్‌స్కేటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో శిక్షణ పొందాడు. 12వ ఏట నుంచి వరుసగా ఐదేళ్లపాటు రోలర్ స్కేటింగ్ హాకీలో రాష్ట్ర స్థాయిలో విజేతగా మెడల్స్ అందుకున్నాడు. ఈ పోటీలన్నీ టీమ్ గేమ్స్ కావడంతో ఇండివిడ్యువల్‌గా 2015లో స్టేట్ మీట్‌కి వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో చైనాలో జరిగే పోటీలకు వెళ్లేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్లలేకపోయాడు.
వ్యక్తిగత గుర్తింపు కోసం..
2015 ఫిబ్రవరి వరకు రోలర్ స్కేటింగ్ హాకీలో జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఉన్నాడు. వ్యక్తిగత గుర్తింపు లేదని నిరాశకు గురై రైఫిల్ షూటింగ్‌పై ఆసక్తి చూపాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని గగననారాయణ అకాడమీలో చేరాడు. మొదటిసారిగా ఆగస్టులో జరిగిన స్టేట్ ఈవెంట్స్‌లో పాల్గొని జూనియర్, సీనియర్ విభాగాల్లో రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. అలాగే 2015,16లో రాష్ట్ర స్థాయి ఈవెంట్స్‌లో టాపర్‌గా నిలిచాడు. ఇటీవల గుంటూరులో జరిగిన ఎయిర్ రైఫిల్ రెనౌండ్ షూటింగ్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచాడు. రెండు బంగారు పతకాలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాలిత్‌ల ద్వారా అందుకున్నాడు.
ఎయిర్ రైఫిల్ రెనౌండ్ షూటర్‌గా ఇండియాలో టాప్ 50కి ఎంపికై ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్నాడు. అలాగే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దేశంలో 11వ ర్యాంకును, ఏపీలో మొదటి ర్యాంకును సాధించాడు. ఆగస్టు రెండోతేదీ నుంచి గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో, 22, 23 తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లోనూ పాల్గొననున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బీబీఎంలో చేరిన ముత్యాలరావు తన లక్ష్యం 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలేనని అంటున్నాడు.