క్రీడా పాటవంతో ఖండాంతరయానం | good talented in basket ball | Sakshi
Sakshi News home page

క్రీడా పాటవంతో ఖండాంతరయానం

Published Tue, Jul 26 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

క్రీడా పాటవంతో ఖండాంతరయానం

క్రీడా పాటవంతో ఖండాంతరయానం

  • బాస్కెట్‌బాల్‌లో రాణిస్తున్న పేదబాలికలు
  • అమెరికా పర్యటనకు  ఎంపిక చేసిన ‘మ్యాజిక్‌ బస్సు’
  • 15 రోజులు ఆ దేశంలో ఉన్న శ్రావణి, అశ్వినిప్రియ
  • అక్కడి పోటీల్లోనూ విజయాలు నమోదు

 

రాజమహేంద్రవరం సిటీ / తాడితోట : 

విమానం ఎక్కడమే కలలోని మాటగా భావించే కుటుంబాలకు చెందిన ఆ ఇద్దరు బాలికలూ ఖండాంతరయానం చేసి వచ్చారు. భూగోళానికి ఆవలివైపున అమెరికాలో 15 రోజులు పర్యటించారు. క్రీడామైదానంలో మెరుపుల్లా కదిలే ఆ బాలలిద్దరూ గోదారి బిడ్డలే. రాజమమహేంద్రవరానికి చెందిన లంకా సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్వినిప్రియ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బాస్కెట్‌బాల్‌ శిక్షణ, పోటీల్లో పాల్గొని సోమవారం నగరానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటన తమకెంతో ఆనందాన్నిచ్చిందని వారు చెప్పారు.
స్థానిక దానవాయి పేట మున్సిపల్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న శ్రావణి, అశ్వినిప్రియ బాస్కెట్‌ బాల్‌ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వీరిని ‘మ్యాజిక్‌ బస్సు’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ గుర్తించింది. ఈ సంస్థ మురికివాడలలోని బాల,బాలికల్లో వివిధ క్రీడలలో ఆసక్తిగల వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణి, అశ్వినిప్రియలను అమెరికా ప్రయాణానికి ఎంపిక చేసింది. ఈ నెల 9న రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన వీరు అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీలలో 15 రోజుల పాటు బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ పొందారు. అక్కడ వివిధ జట్ల మధ్య జరిగిన పోటీలలో పాల్గొని విజయం సాధించారు. న్యూయార్క్‌లో ఆరు రోజులు శిక్షణ పొందిన తాము న్యూజెర్సీలో ఆరు రోజులు పోటీలలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఎంపికయ్యారని, రాజమహేంద్రవరం నుంచి తామిద్దరం ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 
మరో 20 మందిని తీర్చిదిద్దుతాం..
అమెరికా వచ్చిన క్రీడాకారులందర్నీ కలిపి 30∙టీమ్‌లుగా కేటాయించారని, తాము జర్మనీ పేరుతో గల టీమ్‌లో ఆడి విజేతగా నిలిచామని శ్రావణి,అశ్వినిప్రియ చెప్పారు. విజేతగా నిలిచిన తమకు సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. తమకు లభించిన అవకాశం ద్వారా క్రీడలతో పాటు అనేక అంశాలు నేర్చుకున్నామన్నారు. దానిలో భాగంగానే చదువు మానేసిన వారిని గుర్తించి వారు తిరిగి పాఠశాలకు వెళ్ళేలా, క్రీడలలో ఆరితేరేలా తీర్చిదిద్దే ప్రాజెక్టును తమ్కు అప్పగించారని, దానిని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమకు మరలా మ్యాజిక్‌ బస్సు ద్వారా అమెరికా వెళ్ళే అవకాశం వస్తే తమ స్థానంలో మరో ఇద్దరు క్రీడాకారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
సిమెటరీపేటలో వెల్లివిరిసిన ఆనందం
నిరుపేద కుటుంబాలలో పుట్టిన శ్రావణి, అశ్వినిప్రియ రాజమహేంద్రవరంలో సిమెటరీ పేటలో నివసిస్తుంటారు. వీరి తండ్రులు ప్రైవేటు ఎలక్రీ్టషియన్‌లుగా జీవనం సాగిస్తున్నారు. తల్లులు గృహిణులు. వీరు అమెరికా వెళ్ళి తిరిగి రావడంతో సోమవారం రాత్రి  సిమెటరీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానికులు, స్నేహితులు, బంధువులు వీరిని అభినందనలతో ముంచెత్తారు. పుష్పగుచ్ఛాలు అందించి వెన్నుతట్టారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement