బంజారాహిల్స్ (హైదరాబాద్)/సాక్షి, కామారెడ్డి: క్రీడారంగంలోనైనా, ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టైతే ఆడపిల్లలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి క్రీడాకారిణి సూచించారు. అదే సమయంలో క్రీడారంగంలోకి ఎంతో ఇష్టంగా వస్తున్న ఆడపిల్లలను వేధిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించకపోగా, కొందరు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు.
ఆడపిల్లలు ఎందులోనూ త క్కువ కాదని, వారిని ప్రోత్సహించాల్సిందిపోయి వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటీవల హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రీడాకారిణులు, ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో వ్యవహరించినట్టైతే వేధింపులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పవచ్చని చెప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే తాను గట్టిగా హెచ్చరించి వేధింపుల నుంచి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలో పని చేసే ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే..
నువ్వు క్యూట్‌గా ఉన్నావు..ఎప్పుడు కలుద్దాం అన్నాడు
‘బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో నివసించే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేషీలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేందర్ తాను మంత్రి పీఏనని నాకు చెప్పాడు. నాకు 2022 నవంబర్‌లో తైక్వాండ్‌లో సిల్వర్, చెస్ బాక్సింగ్‌లో బంగారు పతకం లభించాయి. ఈ విషయాన్ని మంత్రికి చెప్పాల్సిందిగా సురేందర్‌కు మెసేజ్ చేశా. గత ఏడాది జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆర్థిక సాయానికి సంబంధించిన సిఫార్సు లేఖ ఇవ్వడానికి మరోసారి మంత్రి క్వార్టర్స్‌కు వెళ్లా.
ఇంగ్లాండ్‌లో జరిగిన పోటీలో పతకం లభించినప్పుడు కూడా మెసేజ్ చేశా. ఆయా సందర్భాల్లో సురేందర్ ‘నువ్వు చాలా అందంగా (క్యూట్‌గా) ఉంటావు. మనం ఎక్కడ కలుసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. అసలు విషయం పక్కన పెట్టి క్యూట్‌గా ఉన్నావు.. నన్ను కలుస్తావా..? నీ వయస్సెంత? అంటూ మెసేజ్‌లు పంపాడు. రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇక లాభం లేదనుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చా.
తాను మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిని అని, నాతో పెట్టుకుంటే బాగుండదని, బాడీలో ఏ ఒక్క పార్ట్ పనిచేయకుండా కొడతానని తీవ్రస్థాయిలో హెచ్చరించా. దీంతో సురేందర్ దారికొచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పట్నుంచీ నాతో మర్యాదగానే ప్రవర్తించాడు..’ అని ఆమె తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే ఓ చానెల్లో మాత్రం (సాక్షి కాదు) తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు కథనం ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపులు ధైర్యంగా ఎదుర్కోవాలి
Published Wed, Aug 16 2023 3:49 AM | Last Updated on Wed, Aug 16 2023 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment