జన వాగ్గేయ ఝరి..గోరటి
సాక్షి, సిటీబ్యూరో: శ్రమ జీవుల చెమట చుక్క అతడి కలానికి ఇంధనం. కూలీల కష్టమే అతడి అక్షరానికి ఆలంబన. బడుగు జీవుల బతుకు చిత్రాన్ని తన పాటల్లో ఆవిష్కరించి ఎలుగెత్తి చాటే ఎర్రజెండా అతడు. సామాన్యుల వెతల పల్లకీని మోసే ఉద్యమ బోయీ. అతడే ప్రజా కవిగా జగమెరిగిన గోరటి వెంకన్న. మహబూబ్ నగర్ జిల్లా గౌరారం చెక్కిన శిల్పం. ఆకలి, దోపిడీ ఉన్నచోట పాటై పల్లవించే ఈ తెలంగాణ బిడ్డడు నేడు ‘ప్రజా కవి కాళోజీ నారాయణరావు’ సాహితీ పురస్కారం అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే..
‘మహబూబ్‌నగర్ జిల్లా గౌరారంలో ఆదర్శ భావజాలం ఉన్న నరసింహ, ఈరమ్మ దంపతులకు 1965లో ఏప్రిల్ 4న పుట్టాను. టీచర్ కావాలని ఎంఏ తెలుగు సాహిత్యం చదువుకున్నా. అయితే, కో–ఆపరేటివ్ శాఖలో ఉద్యోగిగా మారాను. చిన్నప్పటి నుంచి ప్రజలు పడే కష్టాలను అక్షరబద్ధం చేసి గొంతు విప్పడం, వారి తరఫున పాటై ప్రశ్నించడం అలవాటు.
శతకోటి వందనాలు..
నా కవిత్వం, పాటను ఆదరించిన సమాజానికి శతకోటి నమస్కారాలు. ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కార ఎంపిక కమిటీ నాపై చూపిన వాత్సల్యానికి, వారి ప్రతిపాదనను అంగీకరించిన సీఎం కేసీఆర్‌కి వందనాలు. నా ఈ కవిత్వం.. పాట ప్రయాణంలో ప్రతి సందర్భంలో సహరించిన అందరికి వందనాలు. మహాకవి కాళోజీ పేరు మీద పురస్కారం అందుకోవడం మాటల్లో వర్ణించలేను. నా కవిత్వానికి, పాటకు ప్రకృతి తల్లి అందజేస్తున్న మహా కానుకగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నా. కానీ రెండు ముద్దు.. తొలిది 70 ఏళ్లు పైబడిన సాహితీ యోధులకు ఇచ్చే హంస అవార్డును 43 ఏళ్లకే అందుకున్న. అప్పటి సీఎం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నన్ను గుర్తించి, అభిమానంగా పురస్కారం అందించారు. కారణం 1996లో ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అనే పాట రాశాను. మొహర్రం పండుగకు గౌరారం వెళ్లా. జనాలే లేరు. బాధేసింది. ఆ బాధను బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో రాశాను. ఆ పాట సమాజంలోని ప్రతి ఒక్కరి గుండెను తాకింది. ఇప్పుడు తెలంగాణ సర్కారు మహాకవి కాళోజీ పురస్కారం అందిస్తోంది. ఇప్పుడు మళ్లీ అంతే ఆనందంగా అందుకోబోతున్నాను’ అంటూ ముగించారు.