తెలంగాణ ఆత్మకు ప్రతీక
- ఠాగూర్ మాదిరి కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు: స్పీకర్
- ఆయన రచనలను నోబెల్‌కు ప్రతిపాదించాలి
- ఘనంగా కాళోజీ 102వ జయంతి ఉత్సవం
- గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆత్మకు ప్రజాకవి కాళోజీ ప్రతీక అని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రవీంద్ర నాథ్ ఠాగూర్‌కు విశ్వకవి బిరుదు ఎలా ఇచ్చారో అలాగే కాళోజీకి విశ్వప్రజాకవి బిరుదు ఇచ్చేలా కాళోజీ ఫౌండేషన్ వారు కృషి చేయాలని సూచించారు. కాళోజీ రచనలను, వ్యక్తిత్వాన్ని, పోరాటాలను, జీవన విధానాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలన్నారు. తెలిపారు. ఎక్కడ అవమానం, అణచివేత ఉంటుందో అక్కడ తాను ఉంటానని కాళోజీ తన రచనల ద్వారా నిరూపించాడని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవం-తెలంగాణ భాషాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడు తూ కాళోజీ పురస్కారానికి గోరటిని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కాళోజీ రచనలు విశ్వజనితమైనవని, నోబెల్ పురస్కారానికి ఆయన రచనలు పంపే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలని సూచిం చారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. 1970 నుంచి కాళోజీతో తమకు పరిచయం ఉందన్నారు. ‘‘మాది తాత, మనవడు అనుబంధం. ఏదైనా నచ్చితే నెత్తికి ఎత్తుకోవడం కాళోజీ తత్వం. నచ్చకపోతే మాత్రం చీల్చి చెండాడుతాడు. ఆయన బతికినంత కాలం తెలంగాణ కోసం పరితపించారు. గోరటి వెంకన్న పాట లు మనుషులు ఉన్నంతవరకు సజీవంగా ఉంటాయి’’ అని అన్నారు.
కడియం మాట్లాడుతూ.. కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం, సాహిత్య పురస్కారాన్ని ఇవ్వటం గర్వంగా ఉందన్నారు. వరంగల్‌లో రెండున్నర ఎకరాల్లో రూ.60 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కాళోజీ పాటలను సీడీ రూపంలో భావితరాలకు అందించడానికి సాంస్కృతిక శాఖ కృషి చేయాలన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గోరటి వెంకన్నకు డాక్టరేట్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాళోజీ 102వ జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం అదృష్టమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు ఆరాధ్యుడన్న కాళోజీ తెలుగువారందరికీ ఆదర్శప్రాయుడ న్నారు.
కాళోజీది ధిక్కార స్వరం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ధిక్కార స్వరం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వక్తలు కొనియాడారు. శుక్రవారం టీఎన్‌జీవో భవన్‌లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్‌జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. అన్యాయాన్ని ఎదిరిం చడంలో, అణచివేతను ఎదుర్కోవడం లో కాళోజీ ధైర ్యం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. వరంగల్‌లో ఆయన పేరిట హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, కాళోజీ జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వానికి ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
నా పాట నాన్న భిక్ష: గోరటి
కాళోజీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తన పాట నాన్న పెట్టిన భిక్ష అని అన్నారు. పురస్కారం అందించిన ప్రభుత్వానికి, సభకు హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. గోరటిని పురస్కారంతో సత్కరించి రూ.1,01,116 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై తన తల్లి ఈరమ్మకు పాదాభివందనం చేశారు. అనంతరం తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు వ ర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, కాళోజీ ఫౌండేషన్ నాగిళ్ల రామ శాస్త్రి మాజీ ఎమ్మల్యే నోముల న ర్సింహయ్య, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.