
'ఉద్దేశపూర్వకంగానే విష్ణుపై కక్ష సాధింపు'
విజయవాడ: కల్తీ మద్యం వ్యవహారంలో మల్లాది విష్ణుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బయట వ్యక్తులు నీళ్లలో సైనేడ్ కలిపారని, ఉద్దేశపూర్వకంగానే విష్ణుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్లకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని రఘువీరా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వస్తే చిల్లర దొరకదని ప్రత్యేక ప్యాకేజీ అడుగుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ, బీజేపీ కుట్రపన్ని హోదా బిల్లుపై ఓటింగ్కు రాకుండా అడ్డుకున్నాయని రఘువీరా అన్నారు.
కాగా విజయవాడ స్వర్ణబార్ మరణాల వెనుక సైనేడ్ ఉందని రుజువయింది. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణుకు చెందిన ఈ బార్‌లో మద్యం తాగి గత ఏడాది డిసెంబర్‌లో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 30 మద్యం శాంపిళ్లకుగాను 20 శాంపిళ్లలో సైనేడ్ కలిసిందని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. మద్యంలో కల్తీలేదని, నీటిలో ఎవరో సైనేడ్ కలిపారని తెలిపింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా మరేదన్నా ఉందా అనేది తేలాల్సి ఉంది.