చెడ్డపనులు చేయాలన్నది హ్యూమన్ సైకాలజీ: బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని, తాత్కాలిక రాజధాని నగరానికి రావాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలో పర్యటించి.. అక్కడ కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి రావల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
మాస్టర్ ప్లాన్ వచ్చేంతవరకు ఉన్న రోడ్లనే అభివృద్ధి చేస్తామని, సీసీ టీవీ కెమెరాలతో శాంతి భద్రతలను పటిష్ఠంగా కాపాడతామని ఆయన అన్నారు. ఏవైనా ఫంక్షన్ జరిగినా నాలుగు డ్రోన్స్‌తో నిఘా పెడతామన్నారు. మూడోనేత్రం ప్రతి ఒక్కరినీ వాచ్ చేస్తుందని చెప్పారు. అవకాశం ఉంటే చెడ్డపనులు చేయాలన్నది హ్యూమన్ సైకాలజీ అని చెప్పారు. డబ్బు తేలిగ్గా సంపాదించాలని కూడా అనుకుంటారని, ఈ విషయంలో ప్రపంచంలో మనుషులంతా ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అనేక దేశాల్లో సిస్టమ్స్ అందరినీ పనిచేయిస్తున్నాయని, ఇక్కడ మాత్రం సిస్టమ్స్ ఇష్టానుసారం చేసేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.
జూన్ 27 తర్వాత అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని ఎప్పటినుంచో చెబుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ సదుపాయాలు ఏం కల్పిస్తున్నారో, అసలు పిల్లల భవిష్యత్తు ఏంటో ఏమీ తెలియకుండా ఎలా వెళ్లాలని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పదేళ్ల పాటు ఉండే అవకాశం ఉన్నా, ఇప్పటికిప్పుడే తాత్కాలిక ఏర్పాట్లతో అక్కడకు వెళ్లడం ఎందుకన్న విమర్శలు వినవస్తున్నాయి.