ఓట్ల వేటలో సర్కారు ఎరలు..!
Published Mon, Feb 6 2017 11:06 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
-జీఓలు : 18, 54, 16, 17లపై ఉపాధ్యాయ సంఘాల నేతలు
-ఎమ్మెల్సీ కోడ్ అమలు గురించి తెలిసే జారీ చేశారని వ్యాఖ్య
భానుగుడి(కాకినాడ) : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఒకేసారి మూడు రకాల జీవోలు వెలువడ్డాయి. కొన్నేళ్లుగా పోరాడుతున్న పండిట్, పీఈటీల అప్‌గ్రడేషన్‌ను అమలు చేస్తూ జీవో : 18, మున్సిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో :54, ఎంఈఓల వయోపరిమితి నిబంధనను తొలగిస్తూ జీవో :16, 17 విడుదల కావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం పెల్లుబికింది. అయితే ప్రస్తుతం పలు జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ జీవోల్లో ఏ ఒక్కటీ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల వేళ ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రభుత్వం వేస్తున్న ‘ఎర’ల్లో భాగమే ఈ జీవోలని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జిల్లాలో అప్‌గ్రేడ్ కానున్న 471 ఉపాధ్యాయులు.
జిల్లాలో తెలుగు పండిట్ 142, హిందీ 124, ఉర్దూ 12, సంస్కృతం 01, తమిళం 02, పీడీ(పీఈటీ) 190 మొత్తం 471 మందిలో పండిట్‌లు స్కూల్ అసిస్టెంట్‌లుగా, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్‌లుగాను అప్‌గ్రేడ్ అవుతున్నారు.
జీవో :54తో 43 మందికి గెజిటెడ్ హోదా.
మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న 43 మందికి జీవో : 54తో గెజిటెడ్ హోదా రానుంది. కాకినాడలో 14, అమలాపురంలో 2, మండపేటలో 1, రామచంద్రపురంలో 3, సామర్లకోటలో 3, రాజమండ్రిలో 13, పెద్దాపురంలో 2, పిఠాపురంలో 3, తుని ఇద్దరు ఉపాధ్యాయులు గెజిటెడ్ హోదా పొందనున్నారు.
ఎంఈవోలు కానున్న 58 మంది హెచ్‌ఎంలు
జీవో :16, 17తో జిల్లాలో 58 మంది ప్రధానోపాధ్యాయులు సీనియార్టీ ఆధారంగా ఎంఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. మొన్నమొన్ననే వీరిని కౌన్సెలింగ్‌కు పిలిచినా 55 ఏళ్ల వయోపరిమితి వి««ధించడంతో కౌన్సెలింగ్ రద్దయింది. ప్రస్తుత జీవోల్లో వయోపరిమితిని పూర్తిగా తొలగించారు.
వేచి చూడాల్సిందే..
అయితే కొన్ని జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కోడ్‌ను అమలు చేయడంతో ఈ జీవోల అమలుకు అడ్డంకి కానుంది. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడితేగాని రాష్ట్రవ్యాప్తంగా ఈ జీవోలు అమలులోకి రావు.
ఇంకొన్నాళ్ళు వేచి చూస్తాం
వ్యాయామోపాధ్యాయుల అప్‌గ్రడేషన్‌కు దీర్ఘకాలికంగా పోరాడుతున్నాం. మరికొంతకాలం వేచి ఉంటాం. ఎన్నికల విషయం తెలిసే జీవోలు విడుదల చేశారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో అన్న దానికి ఇదొక నిదర్శనం.
-ఎల్.జార్జి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి
ఓట్ల కోసమే ఊరింపు
జీవోలు విడుదల చేసిన పెద్దలకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలియనిది కాదు. అయితే ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రభుత్వాలు ఊరింపు చర్యలకు పాల్పడతాయనడానికి ఇదొక నిదర్శనం.
-డీవీ రాఘవులు , యూటీఎఫ్ అధ్యక్షుడు
Advertisement
Advertisement