
దళితుల అభివృద్ధే ధ్యేయం: పిడమర్తి
కలకోవ(మునగాల): తెలంగాణలో దళితుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కారర్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని కలకోవలో దళితులకు మూడు ఎకరాల భూమి సేకరణలో భాగంగా ఆయన గ్రామాన్ని సందర్శించి దళితులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చిర్రా శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పిడమర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హుడైన ప్రతి దళితునికి మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పది వేల ఎకరాల భూమిని మూడువేల రెండు వందల మంది దళితులుకు పంపీణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.361కోట్లు వెచ్చించిదన్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో దళితులకు మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు అవసరమైన భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం ఒక్కో ఎకరాకు రూ.ఏడు లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులను చైతన్యవంతులను చేసి భూమిని కొనుగోలు చేసేందుకు అధికారులు సమాయత్తం మవుతున్నారన్నారు. తొలుత కలకోవకు చేరుకున్న పిడమర్తి రవికి టీఆర్‌ఎస్ గ్రామశాఖ, మండల శాఖ ఆ«ధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గ్రామశివారులో గల అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కోదాడ నియోజక వర్గ ఇన్‌చార్జ్ కె.శశిధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గరిణె కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కోదాటి అరుణ, ముస్కుల సైదిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కేఎల్‌ఎన్ ప్రసాద్, విద్యార్థి జేఏసీ నాయకులు కందుల మధు, స్థానిక నాయకులు కాసాని మల్లయ్య, అమరగాని వీరభద్రం పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవిని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.