ఇస్తికఫాల్ మర్యాదలతో గవర్నర్ శ్రీవారి దర్శనం
ప్రజలంతా సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలి: గవర్నర్
సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత భూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహద్వారం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు గవర్నర్‌కు ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా బలిపీఠానికి సాష్టాంగ నమస్కారం చేసి, ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు నిబంధనల ప్రకారం శ్రీవారి పట్టుశేషవస్త్రాన్ని బహూకరించారు.
తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వదించగా, టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాత్రి వేళ తిరుమలలోని శ్రీవారి నిత్యాన్నప్రసాద భవనంలో గవర్నర్ నరసింహన్ అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషం, ఆరోగ్యం, సుఖం, భాగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.