మొన్న ఐదేళ్లు దాటిన వారికే బదిలీలు.. నిన్న మూడేళ్లు దాటితే చాలు రిక్వస్ట్ ట్రాన్స్‌ఫర్స్ చేయొచ్చు..
- పరిపాలనా సౌలభ్యం పేరిట బదిలీలకు పచ్చజెండా
- గడువు ముగిసినా..తమవారి కోసం మరోరోజు పొడిగింపు
- అమాత్యులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు
- అస్మదీయులకు అందలం.. కానివారికి కలవరం
వడ్డించేవాడు మన బాబైతే.. అన్న చందంగా ఉంది ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారం. అయిన వారికి మామూలు కంచాల్లో కాదు.. బంగారు పళ్లాల్లో గంపగుత్తగా మొత్తం వడ్డించే తీరుతో పాలన సాగుతూ ఉండడమే నేటి విడ్డూరం! ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలను గమనిస్తే చాలు ఏలిన వారి లీలలెన్నో అస్పష్టంగానైనా గోచరమవుతుంది. దాని గురించి ఆలోచించేకొద్దీ సామాన్యులకు మతి పోతుంది. బదిలీల నియమ నిబంధనలను ఇష్టానుసారం మార్చి, ఆటలాడుకుంటున్న విధాన్ని చూస్తే ఎవరికైనా కళ్లు ‘పచ్చ’గా మారడం ఖాయమనిపిస్తుంది.
విశాఖపట్నం: మొన్న ఐదేళ్లు దాటిన వారికే బదిలీలు.. నిన్న మూడేళ్లు దాటితే చాలు రిక్వస్ట్ ట్రాన్స్‌ఫర్స్ చేయొచ్చు..నేడు పరిపాలనా సౌలభ్యం పేరుతో ఎవరినైనా ఎక్కడికైనా బదిలీలు చెయ్యొచ్చు లేదా నిలుపుదల చేయొచ్చు! ఇదీ బదిలీలపై ప్రభుత్వ విధానం. కొందరికి మేలు చేసే ఈ విధానం అనేక మందిని విస్మయపరుస్తున్న వ్యవహారం. బదిలీలపై రోజుకో రీతిలో సర్కార్ ఇస్తున్న ఈ ఆదేశాలు అధికారులకు, ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి.
షెడ్యూల్ ప్రకారం బదిలీల తంతుకు మంగళవారంతోనే గడువు ముగిసింది. కానీ తాజాగా మరో రోజు గడువు పెంచారు. బుధవారం రాత్రి వరకు బదిలీలు చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ‘పాలనాపరమైన అంశాల ప్రాతిపదికమై ఎవరినైనా బదిలీలు చేయండి.. లూప్‌లైన్‌లో ఉన్న వార్ని మెయిన్‌లోకి తీసుకురండి. పనిచేసే వార్ని ప్రోత్స హించండి.. పనితీరు ఆదారంగా బదిలీ చేయండి’ అంటూ సీఎం ఆదేశించడంతో బదిలీలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
మొదట ఒక మాట..: వారం రోజులుగా వివిధ రూపా ల్లో వడపోతల అనంతరం శాఖల వారీగా జాబితాలను కొలిక్కి తీసుకొచ్చారు. అన్నింటికి తుదినిర్ణయం కలెక్టర్‌కే అప్పగించి, కలెక్టర్ ఆమోదించిన తర్వాత ఇన్‌చార్జి మంత్రి సమ్మతితో బదిలీలు పూర్తి చేయాలని మొదట మార్గదర్శకాలు జారీ చేశారు. పేరుకు ఆన్‌ైలైన్ ట్రాన్స్‌ఫర్‌లని చెప్పినప్పటికీ అంతా టీడీపీ ఎమ్మెల్యేలు..నియోజకవర్గ ఇన్‌చార్జిల సిఫార్సుల మేరకే బదిలీల తంతు కానిస్తున్నారు. బదిలీలపై సర్వాధికారాలు మొదట కలెక్టర్‌కు కట్టబెట్టడంతో ఆయన ప్రత్యేక ఫార్మెట్ ద్వారా ఐదేళ్ల సర్వీసు పూర్తి కావడాన్ని ప్రామాణికంగా తీసుకుని శాఖల వారీగా జాబి తాలు రూపొందించారు.
ఇప్పటికే మెజార్టీ శాఖల్లో బది లీలు కొలిక్కి వచ్చాయి. రెవెన్యూ, జెడ్పీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయితీరాజ్, విద్య, ఖజానా, సోషల్ వెల్ఫేర్, బీసీ వె ల్ఫేర్, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, పౌర సరఫరాలు ఇలా దాదాపు అన్ని కీలక మైన శాఖల్లో బదిలీల తంతు ముగించారు. కానీ తాజాగా మంగళవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో బదిలీలకు మరో రోజు గడువు నివ్వడంతో పాటు ఐదేళ్లు, మూడేళ్లు పూర్తి చేసిన వార్ని మాత్రమే బదిలీ చేయాలంటూ తొలుత జారీ చేసిన జీవోలను పక్కన పెట్టి పరిపాలనా సౌలభ్యం పేరిట బదిలీలకు పచ్చజెండా చూ పాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో రాజకీయ ఒత్తిళ్లు మ రింత ఎక్కువవుతాయని జిల్లా అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే అర్హులైన వారు..అర్హత లేని వా రు సైతం సిఫార్సు లేఖలతో బదిలీల కోసం జిల్లా అధికారులను ఒత్తిడి తెస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇత ర ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సులు చేయించుకుంటూ పరిపాలనా సౌలభ్యం పేరుతో కోరుకున్న పోస్టింగ్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి కావడమే ప్రామాణికమని చెప్పడంతో జిల్లాలో 35,200 మంది సిబ్బందిలో 2217 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 434 మందికి బదిలీ ఉత్తర్వులిచ్చారు. కాగా తాజా ఆదేశాలతో ఇదో ప్రహసనంలా మారనుందని ఉద్యోగులు కలవరపడుతున్నారు.