విశాఖపట్నం : హోరాహోరీగా సాగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. గురువారం జరిగే పోలింగ్ కోసం ఓ పక్క అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా మరోపక్క అభ్యర్థులు ఎవరికి వారు చివరి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డా రు. బరిలో నిలిచిన అభ్యర్థులు తలరాతలు రాసేందుకు పట్టభద్రులు సిద్ధమవుతున్నారు.
వరుసగా రెండుసార్లు పీడీఎఫ్ పాగా
2007లో 20 మంది తలపడగా, 2011లో 31 మంది తలపడ్డారు. ఈ రెండుసార్లు కూడా పీడీఎప్ తరపున బరిలోకి దిగిన ఎంవీఎస్ శర్మ విజయకేతనం ఎగురవేశారు. ఈ రెండుసార్లు కూడా బీజేపీ, టీడీపీలు తమ మద్దుతుదారులను రంగంలోకి దింపి గెలిచేందుకు విఫలయత్నం చేశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతోపాటు మేధావుల్లో సైతం పట్టున్న వామపక్షాలు గత రెండు ఎన్నికల్లో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా లెక్కచేయకుండా సిద్ధాతాలకు కట్టుబడి శర్మను గెలిపించుకున్నారు. ఈసారి శర్మ స్థానంలో మరో సీనియర్ వామపక్ష నాయకుడు అవధానుల అజాశర్మను బరిలోకి దింపారు. ఉద్యోగ, కార్మిక ఉద్యమాల్లో దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన అజాశర్మను పోటీకి దింపడంతో మొదటినుంచే వారి ప్రచారం ఊపందుకుంది. మరో వైపు అజాశర్మకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం మరింత బలం చేకూర్చింది. ఈసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలన్నీ ఐక్యతను చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి.
టీడీపీపై వ్యతిరేకతే శాపం
మరోవైపు టీడీపీ–బీజేపీ తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేత పీవీఎన్ మాధవ్‌ను రంగంలోకి దించాయి. గతంలో విడివిడిగా పోటీ చేసి విపలమైన ఈ రెండు పార్టీలు ఈసారి ఉమ్మడిగా పోటీ చేయడం ద్వారా వామపక్షాల చేతుల్లో నుంచి ఈ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించాయి. ప్రచారంలో చమటోడ్చాయి. చివరకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో సహా ఉత్తరాంద్ర, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మాధవ్ కోసం అలుపెరగని రతిలో ప్రచారం చేశారు. ఓ పక్క మాధవ్ గెలిస్తే ఎక్కడ తమకు పక్కలో బల్లెంలా తయారవుతాడని ఆందోళన లోలన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు లోపల కత్తులు దూస్తూనే పైకి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తూనే ప్రచారం సాగించారు. మరోపక్క మాధవ్‌కు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది.
ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ నగరాధ్యక్షుడు నాగేంద్ర, çపృధ్వీరాజ్, రామకోటయ్య వంటి పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎంపీ కే.హరిబాబు సైతం నామిషన్ సందర్భంలోనూ, కేంద్రమంత్రి వచ్చినప్పుడు తప్ప ఆ తర్వాత కన్పించలేదు. కాగా మాధవ్‌కు వ్యక్తిగతంగా మంచి పేరున్నా.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, విభజన చట్టంలోని హామీలు అమలుకాకపోవడం గుదిబండగా మారాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి మంగళవారం రాత్రి అమరావతిలో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ మాధవ్ గెలిచే అవకాశం లేదని అన్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
సవాల్ విసిరన స్వతంత్రుడు
ఇద్దరు బలమైన అభ్యర్థులను సవాల్ చేస్తూ మేధావులు, జర్నలిస్టు సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ జర్నలిస్టు వీవీ రమణమూర్తి కూడా విజయంపై ధీమాతోనే ఉన్నారు. కానీ ఈయనకు మద్దతునిస్తున్న జర్నలిస్టు సంఘాలు కానీ, సామాజిక వర్గీయుల్లో కానీ ఎంతమంది ఓటుహక్కు కలిగి ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. 2007లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్న యడ్ల ఆదిరాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించకుంటున్నారు. మిగిలిన 26 మంది పోటీ నామమాత్రమే.
పట్టభద్రుల పీఠం ఎవరిదో?
Published Fri, Mar 10 2017 1:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement