ఘనంగా వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు శౌరీ విజయకుమారి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్‌ఆర్ అభిమానులు హాజరై కేకును కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు కేకు, మిఠాయిలను పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వైఎస్ విజయమ్మ సారథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేవరకు సమష్టిగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నాయకులు నాగరాజు యాదవ్, కటారి సురేష్, ఉమాభాయ్, రాజీవ్ కుమార్, సాంబ, సంజీవ్, ఏసన్న తదితరులు పాల్గొన్నారు.
నేడు చలివేంద్రం ప్రారంభం..
వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని రవిటాకీసు సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టడంలో విఫలమైందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చలివేంద్రాల్లో మంచినీటితోపాటు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు వివరించారు.