గణేశుడికి ఘనంగా వీడ్కోలు
గణేశుడికి ఘనంగా వీడ్కోలు
Published Wed, Sep 14 2016 9:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
– 200కుపైగానే భారీ విగ్రహాలు
– మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగిన నిమజ్జనోత్సవం
కర్నూలు(హాస్పిటల్): వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజుల ప్రత్యేక పూజల అనంతరం మంగళవారం గంగమ్మ ఒడి చేరిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వినాయక నిమజ్జనోత్సవం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది. కుమ్మరివీధిలోని రాంబొట్ల దేవాలయం వద్ద కొలువుదీరిన వినాయకుడు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకే చివరి పూజలు అందుకుని నిమజ్జనానికి బయలుదేరాడు. అయితే ముస్లింల బక్రీదు ప్రార్థనల నేపథ్యంలో ఊరేగింపు నెమ్మదిగా సాగింది. కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయక్‌ఘాట్‌లో మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు విగ్రహాలు ఘాట్‌కు చేరుకోలేకపోయాయి. ఈసారి అత్యధిక సంఖ్యలో విగ్రహాల వెంట డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి భక్తులు కేరింతలు, కోలాటాలు, నృత్యాల మధ్య ప్రదర్శన నెమ్మదిగా సాగింది. గణేష్ ఉత్సవ సమితి అంచనా మేరకు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. మొత్తం 1200కుపైగా విగ్రహాలుండగా 25 అడుగులకు మించి ఉన్నవి 200కు పైగా ఉన్నాయి. వీటి నిమజ్జనానికి ఎక్కువ సమయం తీసుకోవడం, భారీ క్రేన్‌లు నాలుగు తెప్పించినా వాటికి గంటకోసారి పావు గంట విరామం ఇవ్వాల్సి ఉండడంతో ఈ ఏడాది నిమజ్జన కార్యక్రమం ఆలస్యమైంది. చివరిగా బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బుధవారపేట శక్తి వినాయకయూత్ వారు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కాస్త ఆలస్యమైనా, వర్షం పడుతున్నా లెక్క చేయకుండా సమితి సభ్యులు, కార్యకర్తలు, భక్తులు కార్యక్రమాన్ని నిర్వఘ్నంగా జరిపించారని గణేశ్ ఉత్సవ సమితి జిల్లా కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య కొనియాడారు. ఆర్గనైజింగ్ సెక్రటరి ఎం. నాగఫణిశాస్త్రి, నగర కార్య అధ్యక్షుడు కె. క్రిష్ణన్న, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, హరీష్‌బాబు, నరసింహవర్మ, భాస్కర్ తదితరుల సేవలను ఆయన అభినందించారు.
Advertisement