విమాన చప్పరంపై వినాయక స్వామి వారు
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి విమానోత్సవ సేవ కనుల పండువగా జరిగింది. విమాన చప్పరంలో స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో స్వామి వారి మూల విగ్రహనికి పంచామృత అభిషేకం అనంతరం సుందరంగా అలంకరించి పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు సిద్ధి,బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను సర్వాలంకృత శోభితులను చేసి, ఆలయ అలంకార మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి పల్లకి పై తీసుకువచ్చి అలంకరణతో సిద్ధంగా ఉన్న విమాన చప్పరంలో కొలువు దీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులు, పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉదయం నుంచి ఆలయంలో రద్దీ సాగింది. ఈ ఉత్సవానికి దేవస్థానం వారు , ఐరాలకు చెందిన రామకృష్ణ పిళై ్ల కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, స్వాములు, ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు.
నేడు పుష్ప పల్లకి
ప్రత్యేకోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నారు. ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు ఉంటాయి.