vinayakaswami
-
వైభవం.. విమానోత్సవం
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి విమానోత్సవ సేవ కనుల పండువగా జరిగింది. విమాన చప్పరంలో స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో స్వామి వారి మూల విగ్రహనికి పంచామృత అభిషేకం అనంతరం సుందరంగా అలంకరించి పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు సిద్ధి,బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను సర్వాలంకృత శోభితులను చేసి, ఆలయ అలంకార మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి పల్లకి పై తీసుకువచ్చి అలంకరణతో సిద్ధంగా ఉన్న విమాన చప్పరంలో కొలువు దీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులు, పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉదయం నుంచి ఆలయంలో రద్దీ సాగింది. ఈ ఉత్సవానికి దేవస్థానం వారు , ఐరాలకు చెందిన రామకృష్ణ పిళై ్ల కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, స్వాములు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు. నేడు పుష్ప పల్లకి ప్రత్యేకోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నారు. ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు ఉంటాయి. -
విఘ్ననాథుడికి విరి సేవ
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి పూలంగి సేవ నేత్రపర్వంగా జరిగింది. సిద్ధి,బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పరిమళాలు వెదజల్లే దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం స్వామివారి మూల విగ్రహనికి విశేష అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలోని అర్ధ, మూషిక, ఆన్వేటి, సుపథ మండపాలను పరిమళభరిత పుష్పమాలికలతో అలంకరించారు. రాత్రి 9గంటలకు సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిపై అలంకార మండపానికి వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలు, దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆన్వేటీ మండపానికి వేంచేపు చేసి ఊయలలో కొలువుదీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ ఉభయ దేవేరులతో సేదతీరుతున్న వినాయక స్వామిని దర్శించి భక్తులు పులకించారు. అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లి కార్జున పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన వాహనసేవలకు విస్తృత ఏర్పాట్లు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాలలో భాగంగా రేపటినుంచి జరిగే ప్రధాన వాహన సేవలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కల్పవృక్ష వాహనం, శుక్రవారం విమానోత్సవం, శనివారం పుష్పపల్లకి, ఆదివారం తెప్పోత్సవం జరుగునుంది. ఈఓ పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు జరుగుతున్నాయి. పుష్కరిణిని శుభ్రం చేసి కొత్త నీటిని నింపడం, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. -
వైభవం.. సామూహిక వరలక్ష్మీవ్రతం
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈవో పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో స్వామివారి మూల విగ్రహనికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాడవీధుల ఊరేగింపు నిర్వహించారు. తరువాత ఆలయ ఆస్థాన మండపంలో సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి వారిని ఆశీనులు గావించి, పూజలు చేశారు. ఆ తరువాత వ్రత కలశాలను ఏర్పాటు చేసి వరలక్ష్మీ వ్రతం జరిపారు. ఈ సందర్బంగా వేదపండితులు భక్తులకు వరలక్ష్మీ దేవి వ్రత కల్పాలను చదివి వినిపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరిMీ అధికారులు తీర్థప్రసాదాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కేశవరావు,సూపరింటెండెంట్ రవీంద్ర బాబు పాల్గొన్నారు.