గ్రానైట్ క్వారీ కార్మికుడి ఆత్మహత్య
Published Fri, Sep 2 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
తిమ్మాపూర్ : తిమ్మాపూర్ గ్రామ శివారులోని సన్‌షైన్ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్ గ్రామానికి చెందిన మండల్ అరవింద్(50) భార్య, పిల్లలతో ఐదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు. క్వారీ వద్ద షెడ్డులో నివాసముంటూ క్వారీలోనే పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం స్వగ్రామంలో చిన్న కూతురు వివాహం చేశాడు. అప్పులు తెచ్చి వివాహం చేసిన అరవింద్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందాడు. శుక్రవారం వేకువజామున షెడ్డుకు దూరంగా వెళ్లాడు. బహిర్భూమికి వెళ్లాడని భార్య, కుమారుడు భావించారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. క్వారీకి కొంత దూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అరవింద్ అల్లుడు పంకజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Advertisement
Advertisement