timmapoor
-
వీర జవాన్లకు నివాళి
ఇబ్రహీంపట్నం: కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు మండలంలోని తిమ్మాపూర్, ఎర్దండిలో శనివారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. జవాన్ల ఫోటోల వద్ద కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రాజవ్వ, సింగిల్‌విండో చైర్మన్ నోముల లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ సునిల్, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, నాయకులు సత్తన్న, నిరంజన్ భట్టు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో ఇన్స్పైర్ అవార్డు 2016 రెండు జిల్లాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రెండోరోజు శనివారం అనూహ్య స్పందన లభించింది. కరీంనగర్, నిజామాబాద్ నుంచి 172 ఎగ్జిబిట్స్ను ప్రదర్శించినట్లు జిల్లా సైన్స్‌ఫేర్ అధికారి స్వదేశీ కుమార్ తెలిపారు. ప్రదర్శనను మండలంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు కరీంనగర్ నగరంలోని పాఠశాలలు, ఇతర పాఠశాలల విద్యార్థులు రావడంతో ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నిజామాబాద్ డీఎస్వో గంగాకిషన్, మండల విద్యాధికారి లక్ష్మణ్‌రావు, న్యాయనిర్ణేతలు, రిసోర్సు పర్సన్లు కిషన్‌రెడ్డి, వెంకన్న, నరేష్, సురేందర్, అనంతాచార్య, శర్మ, రవీందర్ పాల్గొన్నారు. -
ముగిసిన రూరల్ జోన్ క్రీడోత్సవాలు
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ తిమ్మాపూర్ విజేతలకు బహుమతులు అందజేసిన మేయర్ రవీందర్ సింగ్ కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న కరీంనగర్ రూరల్ జోన్ క్రీడోత్సవాలు శుక్రవారం ముగిశాయి. పోటీలకు ఏడు మండలాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–14, 17 బాలబాలికలకు రన్నింగ్, జంప్స్, త్రోస్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో రాణించిన తిమ్మాపూర్ మండల జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. రూరల్ జోన్‌స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపికచేశారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి పుర్మ తిరుపతిరెడ్డి, కరీంనగర్ రూరల్ జోన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, మండలకార్యదర్శులు బిట్ర శ్రీనివాస్, సమ్మయ్య, బుచ్చిరెడ్డి, రవి, పీఈటీ, పీడీలు యూనుస్‌పాష, సత్యానంద్, ఎజాజ్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ క్వారీ కార్మికుడి ఆత్మహత్య
తిమ్మాపూర్ : తిమ్మాపూర్ గ్రామ శివారులోని సన్‌షైన్ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్ గ్రామానికి చెందిన మండల్ అరవింద్(50) భార్య, పిల్లలతో ఐదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు. క్వారీ వద్ద షెడ్డులో నివాసముంటూ క్వారీలోనే పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం స్వగ్రామంలో చిన్న కూతురు వివాహం చేశాడు. అప్పులు తెచ్చి వివాహం చేసిన అరవింద్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందాడు. శుక్రవారం వేకువజామున షెడ్డుకు దూరంగా వెళ్లాడు. బహిర్భూమికి వెళ్లాడని భార్య, కుమారుడు భావించారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. క్వారీకి కొంత దూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అరవింద్ అల్లుడు పంకజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
మెరుగైన సేవలు అందించాలి
తిమ్మాపూర్ : రవాణాశాఖ సేవల కోసం మీ సేవా, ఈ సేవా కేంద్రాలకు వచ్చేవారికి మెరుగైన సేవలు అందించాలని కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ కోరారు. తిమ్మాపూర్ రవాణాశాఖ కార్యాలయంలో ఈ సేవా, మీ సేవా కేంద్రాల నిర్వాహాకుల శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించిన 57 సేవలను మీ సేవా, ఈ సేవా కేంద్రాలకు అప్పగించడం జరిగిందన్నారు. ఆగస్టు 2 నుంచి ఆర్టీఏ ఆఫీసుల్లో నగదు లావాదేవీలు జరుగవని తెలిపారు. సంబంధిత పత్రాలు లేకుండా ఆన్లైన్ చేస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. జిల్లాలో 500 మంది వరకు నిర్వాహాకులకు నాలుగు రోజులపాటు విడతల వారిగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఏవోలు శ్రీనివాస్, మస్లియొద్దిన్, టెక్నిషియన్లు కరుణాకర్, చేతన్, సిబ్బంది ఉన్నారు. -
చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం
హరితహారంలో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారు ఆఫీసులో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము రిజిస్ట్రేషన్‌కు అధికంగా వసూలు చేస్తే డీలర్లపై చర్యలు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తిమ్మాపూర్: చెట్లతోనే కాలుష్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని, అందుకే విరివిగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా కోరారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ ఆఫీసులో బోరుమోటార్‌ను గురువారం ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటూ పోటీపడి మెుక్కలు నాటుతున్నారన్నారు. తమశాఖ ఆధ్వర్యంలో 15వేల వరకు మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఆఫీస్‌లు ఫారెస్టులుగా మారాలని సూచించారు. సీఎం ఆదేశించిన తర్వాత హరితహారంలో ప్రతీ డిపార్ట్మెంట్ పాల్గొంటుందని, కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. ఉత్సాహంగా నాటిన మరచిపోకుండా మొక్కలను కాపాడుకోవాలని, ఆరునెలలపాటు వాటిని శ్రద్ధగా చూడాలని సూచించారు. మొక్కల ఆవశ్యకతపై విద్యార్థులను ప్రశ్నిస్తూ మాట్లాడించారు. కార్యక్రమంలో జేటీసీ పాండురంగరావు, డీటీసీ వినోద్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ ప్రేమలత, వైస్ ఎంపీపీ భూలక్ష్మి, సర్పంచ్ స్వరూప, ఎంవీఐలు కొండాల్‌రావు, శ్రీనివాస్, రమాకాంత్‌రెడ్డి, రవీందర్, వేణు, కిషన్‌రావు, ఏవోలు శ్రీనివాస్, మస్లియొద్దీన్, ఏఎంవీఐలు, ఉద్యోగులు, ఆల్ఫోర్స్, పారమిత, గౌతమీ ఈ టెక్నో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నాం.. రవాణాశాఖపరంగా ఆన్లైన్ విధానంలో సమస్యలు వస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కమిషనర్ సుల్తానియా తెలిపారు. డీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్యాలయాల్లో ఉద్యోగులు తక్కువున్నా తమ చేతిలో ఏమీ లేదని, ఉన్న వారితో పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 45 మంది ఏఎంవీఐలు, 160 మంది కానిస్టేబుళ్ల నియామాకాలు జరుగుతున్నాయని చెప్పారు. జీరో రశీదు సమస్యలపై స్టడీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 2నుంచి దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే చేసుకోవాలని, ఈ–సేవా, ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందులోని సమస్యలను పరిష్కరించడానికి 15రోజుల గడువు తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి షోరూమ్‌ల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఎంవీఐల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్లక్ష్యంతో పేరుతో తీసిన సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆఫీసులో కౌంటర్లను పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడారు.