– వర్గవిభేదాలతో టీడీపీ సతమతం
– పలు నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు.. పరస్పరం ఫిర్యాదుల వెల్లువ
– ఎంపీ జేసీ, ఎమ్మెల్యే చౌదరి మధ్య తారాస్థాయికి ఆధిపత్యపోరు
– పరిటాల సునీత, వరదాపురం సూరి వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు
– కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషా వర్సెస్ కందికుంట
– నేతల మధ్య విభేదాలతో వర్గాలుగా చీలిపోయిన పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో వర్గపోరుతో ద్వితీయశ్రేణి నేతలు రెండుగా చీలిపోయారా? పార్టీ పరిస్థితి దిగజారిపోయిందా? గాడిన పెట్టాల్సిన మంత్రులే విభేదాలతో సతమతమవుతున్నారా? ఎవరికివారు ఆర్థికంగా లబ్ధిపొందడం మినహా జిల్లా ప్రయోజనాలను గాలికొదిలేశారా? ఈ వైఖరి కూడా పార్టీకి తీవ్రనష్టం చేకూరుస్తోందా? ..తాజా పరిణామాలు బేరీజు వేస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వర్గవిభేదాలు తీవ్రంగా ఉన్నాయి. కొంతమంది నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది.ఈ ప్రభావం ఆ పార్టీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలపైనా పడింది. కొంతమంది ద్వితీయశ్రేణి నేతలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలకు సంబంధించిన కేడర్ కూడా పూర్తిగా దూరమవుతోంది.
'అనంత'లో తారాస్థాయికి..
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో 'అనంత' అసెంబ్లీ బరిలో తనయుడు పవన్‌ను దింపాలని భావిస్తోన్న జేసీ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. పార్లమెంట్‌ను పూర్తిగా వదిలేసి 'అనంత'పైనే దృష్టి సారించారు. ప్లాస్టిక్ రద్దు పేరుతో నగరంలో 15రోజులుగా హడావుడి చేస్తున్నారు. మరువవంక, నడిమివంకల్లో పూడికతీత పనులకు ఉపక్రమించారు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్‌ను పూర్తిగా పక్కనపెట్టి స్వతంత్రంగా 'అనంత'లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే కూడా ఇటు మేయర్, అటు జేసీతో విభేదించి ఓ వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇందులో భాగంగానే స్టాండింగ్ కమిటీలో మేయర్ వర్గీయులను ఓడించారు. గెలిచిన ఎమ్మెల్యే వర్గీయులు ప్రస్తుతం మేయర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని కూడా వీరు బహిష్కరించారు. మేయర్‌పై కూడా జేసీ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో 'అనంత'లో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
కదిరిలో రచ్చ
కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మధ్య వివాదం ముదిరిపాకాన పడింది. అత్తార్ రాకను జీర్ణించుకోలేని కందికుంట, ఆయన వర్గీయులు ప్రతి అంశంలోనూ చాంద్‌బాషాను టార్గెట్ చేస్తున్నారు. చాంద్‌బాషా కూడా ఽసర్దుకుని పోలేక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకోవాలనే రీతిలో కేడర్‌లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కదిరిలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఈ విషయం జనచైతన్యయాత్రలో మరోసారి స్పష్టమైంది. ఈ యాత్రలకు కందికుంట వర్గం పూర్తిగా గైర్హాజరవుతోంది. మునిసిపాలిటీలో కౌన్సిలర్లతో పాటు, రూరల్‌లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏ ఒక్కరూ పాల్గొనడం లేదు. కేవలం చాంద్‌బాషా తనవద్ద ఉన్న వారితో కార్యక్రమాన్ని లాగిస్తున్నారు. దీంతో యాత్రలు వెలవెలబోతున్నాయి.
వరదాపురం వర్సెస్ పరిటాల
ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల వర్గీయుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు మంత్రి సునీతతో వరదాపురం సూరి విభేదించారు. ఆగస్టు 6న ధర్మవరంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వందలాది ఫ్లెక్సీలలో ఒక్కదాంట్లో కూడా సునీత ఫొటో కన్పించలేదు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. ఇటీవల ధర్మవరంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ధర్మవరం కుడికాలువ పనుల్లో కూడా విభేదాలు తలెత్తాయి. ఈ అంశం సీఎం దృష్టికి కూడా వెళ్లింది. సూరికి ఎలాగైనా చెక్‌పెట్టాలనే రీతిలో పరిటాల వర్గం వ్యూహం రచిస్తోంది. వీరి మధ్య తలెత్తిన విభేదాలు ధర్మవరం, రాప్తాడు.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చూపుతున్నాయి. ఇవి ఏస్థాయికి వెళతాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై మునిసిపల్ చైర్మన్ గంగన్న అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పుట్టపర్తిలో వర్గవిభేదాలను మంత్రి పెంచిపోషిస్తూ, పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయదుర్గంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డిని పూర్తిగా పక్కనపెట్టారు. ఎన్నికల్లో సహకరించినా కాలవ తనను పూర్తిగా పక్కనపెడుతున్నారని మెట్టు కూడా అసమ్మతితో ఉన్నారు.
మడకశిరలో ఎమ్మెల్యే ఈరన్నను పక్కనపెట్టి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీన్ని ఈరన్న జీర్ణించుకోలేకపోతున్నారు. విభేదాల పరిస్థితి ఇలా ఉంటే మంత్రులతో పాటు చీఫ్‌విప్, విప్ అంతా కలిసి జిల్లా అభివృద్ధిని విస్మరించారని 'అనంత'వాసుల్లో తీవ్రస్థాయి అసంతృప్తి ఉంది. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు, హెచ్చెల్సీ నీటి వాటా విషయంలో అలసత్వం, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరు చేయించడంలో నిర్లిప్తతతో పాటు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రమూ శ్రద్ధ లేదని ప్రజలు అంటున్నారు. నేతలు ఆర్థికంగా ఎదగడం మినహా జిల్లాను పూర్తిగా విస్మరించారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇవన్నీ టీడీపీ అత్యంత బలహీనపడేందుకు కారణమయ్యాయి.
కలహాల కాపురం
Published Tue, Nov 15 2016 11:18 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement
Advertisement