జీఎస్‌టితో వ్యాపారులకు ప్రయోజనం
కర్నూలు(హాస్పిటల్): దేశంలో జూలై ఒకటి నుంచి అమలయ్యే జీఎస్‌టీతో వ్యాపారులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తాతారావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిఫ్‌కోర్టు సమీపంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో ట్రేడర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఐ.విజయకుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీసీ తాతారావు మాట్లాడుతూ.. జూలై ఒకటి నుంచి దేశమంతా ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుందన్నారు. ఈ విధానంపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో రిటర్న్స్ ఎలా కట్టాలి, పన్నులు ఎలా చెల్లించాలి, నూతన విధానాల ఎలాగుంటాయనే విషయాల గురించి ట్రేడర్లకు కూలంకుషంగా వివరిస్తున్నట్లు తెలిపారు. జీఎస్‌టీతో వ్యాపారులకు పన్నులు తగ్గుతాయని, దేశంలో ఎక్కడ నుంచైనా సరుకులు కొనుగోలు చేసినా ఒకేసారి పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది వ్యాపారులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ బుచ్చన్న, సీటీవోలు నరేంద్ర ప్రసాద్, హుసేన్‌సాహెబ్, రామాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.