25న ఆమరణ నిరాహార దీక్ష
రాజమహేంద్రవరం క్రైం: పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు దళితులను సాంఘికంగా బహిష్కరించిన నిందితులను అరెస్ట్ చేయకుంటే ఈనెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష తన నివాసంలో చేపడతానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గరగపర్రు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారని, సాంఘిక బహిష్కరణ చేసిన వారికి బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
స్థానిక పోలీసులు బెయిల్ లభించే విధంగా కేసులు కట్టారన్నారు. నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు. ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ముట్టడి చేపట్టాలని దళితులకు పిలుపునిచ్చారు. కాగా, హర్షకుమార్, ఆయన తనయుడు శ్రీరాజ్‌ను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతో త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ సొంత పూచీకత్తులపై తిరిగి విడుదల చేశారు.