చిన్ని గుండె ఆగిపోయింది..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : విధికి కన్ను కుట్టింది.. ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ బాలుడి జీవితాన్ని అర్ధంతరంగా తుంచేసింది.. ఆదుకుంటామని దాతలు ముందుకొస్తున్నా దయలేని మృత్యువు తొందరపడింది.. హద్రోగ సమస్యతో బాధ పడుతున్న పియూష్‌కుమార్ గురించి ‘చిన్ని గుండెకు ఎంత కష్టం!’ శీర్షికన సాక్షిలో గత నెల 26న కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఆ చిన్నారికి సాయపడేందుకు దాతలెందరో ముందుకువచ్చారు. ఉన్నత వైద్యం అందించేలోపే పరిస్థితి విషమించి ఆ బాలుడు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన జి.పద్మావతి భర్త భిలాయ్‌లోని మహేంద్రటెక్‌లో పనిచేసేవారు. వారికి బాబు పీయూష్ కుమార్, పాప భార్గవి ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో భర్త మరణించారు.
దీంతో పద్మావతి పిల్లలతో సహా విశాఖలో చెల్లెలు ఇంటికి వచ్చేశారు. ఆర్నెల్ల క్రితం పీయూష్‌కు కడుపునొప్పి రావడంతో ఓ వైద్యుడిని సంప్రదించగా ఆయన హృద్రోగ నిపుణుడిని కలవాలని సూచించారు. కేజీహెచ్‌లో పరీక్షించిన డాక్టర్లు బాబు గుండె మూడింతలైందని, రక్తప్రసరణ కష్టమవుతోందని చెప్పారు. బాబు బతకాలంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరని, ఇందుకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో తల్లి కన్నీరుమున్నీరయింది. ఈ బాలుడి కన్నీటి కథ సాక్షిలో ప్రచురితమైంది.
ఆపన్న హస్తం అందేలోగానే..
గురువారం రాత్రి 11 గంటల ప్రాం తంలో బాబుకి తీవ్రంగా కాళ్లు నొప్పు లు వచ్చాయి. ఎప్పుడూ వస్తున్న నొప్పు లే కదా..అని టాయిలెట్ పోయించి పడుకోబెట్టారు. కాళ్ల నొప్పుల తీవ్రత మరింతగా ఉండడంతో శుక్రవారం వేకువజాము 4 గంటల సమయంలో కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాబుని పరీక్షించి అర్జెంట్‌గా స్కానింగ్ తీయించాలని, కేజీహెచ్‌లో లేదని కేర్ ఆస్పత్రిలో స్కానింగ్ తీయించి తీసుకురమ్మన్నారు. అక్కడకు తీసుకువెళ్లగా వేకువజామున స్కానింగ్ సిబ్బంది లేరు. వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తుండగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాబు పరిస్థితి విషమించడంతో తల్లి అనుమతి మేరకు అక్కడి వైద్యులు కరెంట్ స్ట్రోక్ ఇచ్చారు. పరిస్థితి మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాబు చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పీయూష్ కుమార్ చదువుతున్న స్టెల్లా మేరీస్ స్కూల్ యాజమాన్యం మరణ వార్త తెలుసుకొని బాబు ఇంటికి వచ్చి నివాళులర్పించారు. శనివారం స్కూల్‌కి సెలవు ప్రకటించినట్టు బాబు తల్లి పద్మావతి సాక్షికి తెలిపారు.