సాక్షి, అమరావతి: జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్) పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం వల్ల ఆదాయాలు తగ్గి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చర్య ఆందోళన కలిగిస్తోంది. జీఎస్టీ పరిహారంగా ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్యకాలంలో రాష్ట్రానికి రూ.1,966.33 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 529 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1,437.33 కోట్ల పరిహారం కేంద్రం నుంచి రావాలి. జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోవడంతో పరిహారం సకాలంలో చెల్లించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.
ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాల్సిందే
జీఎస్టీ అమలు చేసినప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గితే దాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకు 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ఆధారంగా తీసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయం కంటే 14 శాతం వృద్ధి లేకపోతే.. ఎంత మేర తగ్గితే ఆ మొత్తాన్ని పరిహారంగా కేంద్రం చెల్లిస్తుంది. జీఎస్టీ అమలు సంవత్సరంలో మన రాష్ట్రానికి 2017–18 సంవత్సరానికి కనీస ఆదాయం లక్ష్యాన్ని నెలకు రూ.1,502.48 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు 2019–20 సంవత్సరానికి కనీస ఆదాయ మొత్తం నెలకు రూ.1,952.62 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలానికి రాష్ట్రానికి రూ.13,668.35 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.11,702.02 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ ఏడు నెలలకు కేంద్రం రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా రూ.1,966.33 కోట్లు చెల్లించాలి.
జాప్యంపై వివిధ రాష్ట్రాల ఆందోళన
జీఎస్టీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యంపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఆర్థిక మందగమనంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోయారు. జీఎస్టీ పరిహారంగా రాజస్థాన్‌కు రూ.4,400 కోట్లు, ఢిల్లీకి రూ.2,355 కోట్లు, పంజాబ్‌కు రూ.2,100 కోట్లు, కేరళకు రూ.1,600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది
నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు
ఈ ఏడు నెలల కాలానికిగాను రూ.1,437.33 కోట్ల పరిహారం చెల్లింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్రం నుంచి హామీ వచ్చింది. ఇది కాకుండా డిసెంబర్ నాటికి మరో రూ.500 కోట్లు పరిహారం కోరాల్సి ఉంటుంది.
- పీయూష్ కుమార్, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment