కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో..
దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్‌పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్‌కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది.
అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు.
అలా అనలేదు..
మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్‌కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు.
పొలిటికల్ డ్రామా..
ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్‌కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్‌పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్‌పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా.
ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్‌లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్‌లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్‌లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్‌చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు.
Comments
Please login to add a commentAdd a comment