మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వేసవిలో ‘పీయూష్’ అనే పానీయాన్ని విరివిగా తాగుతారు. దాదాపు దీని తయారీ లస్సీ మాదిరిగానే ఉంటుంది. బాగా చిలికిన పెరుగులో పంచదారతో పాటు శ్రీఖండ్ అనే సంప్రదాయ మిఠాయిని, జాజికాయ పొడి, ఏలకుల పొడి వంటివి చేర్చడం వల్ల దీనికొక విలక్షణమైన రుచి ఏర్పడుతుంది. ‘పీయూషం’ అంటే అమృతం అనే అర్థం ఉంది. ‘పీయూష్’ పానీయం అమృతసమానంగా ఉంటుందని మరాఠీ, గుజరాతీ ప్రజలు చెబుతారు.
చదవండి: Health Tips: ఇవి తింటే బీపీ అదుపులో ఉంటుంది!
ఉత్తరాది రాష్ట్రాల్లో జల్‌జీరా, ఆమ్ కా పన్నా, ఖస్‌ఖస్, రూహ్ అఫ్జా వంటి సంప్రదాయ పానీయాలను వేసవిలో విరివిగా వినియోగిస్తారు. జీలకర్ర, మిరియాలు వంటివి కలిపి తయారుచేసే జల్‌జీరాను సాధారణంగా భోజనానికి ముందు సేవిస్తారు. దీనివల్ల అలసట తీరి, ఆకలి పుడుతుందని, జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెబుతారు. పచ్చి మామిడికాయలతో తయారుచేసే ఆమ్ కా పన్నా, వట్టివేళ్లు, గసగసాలు కలిపి తయారుచేసే ఖస్‌ఖస్ పానీయాలను కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా సేవిస్తారు.
గులాబీరేకుల కషాయానికి చక్కెర పాకాన్ని జోడించి తయారు చేసే ‘రూహ్ అఫ్జా’తో నేరుగా షర్బత్ తయారు చేసుకోవడమే కాకుండా, దీనిని లస్సీ, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌ల వంటి వాటిలోనూ అదనపు రుచికోసం ఉపయోగిస్తారు. ఘజియాబాద్‌కు చెందిన హఫీజ్ అబ్దుల్ మజీద్ అనే యునాని వైద్యుడు శతాబ్ది కిందట రూపొందించిన ‘రూఫ్ అఫ్జా’ భారత ఉపఖండమంతటా విరివిగా వినియోగంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో చందనం పొడి, కుంకుమపువ్వు, పంచదార, నిమ్మరసం కలిపి తయారు చేసే చందన షర్బత్‌ను కూడా వేసవి పానీయంగా సేవిస్తారు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, వేసవితాపాన్ని తీర్చడంలో బాగా దోహదపడతాయి. ఈ వేసవిలో మీరూ వీటి రుచులను ఆస్వాదించండి.
Comments
Please login to add a commentAdd a comment