ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు. ఇటీవల అమిత్‌షా ‘అవినితికి రారాజు’ అంటూ తనపై చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు షా దూరంగా ఉండాల్సి వచ్చిందని ఎదురుదాడికి దిగారు.
“కొన్ని రోజుల క్రితం, హోం మంత్రి అమిత్ షా నాపై విమర్శలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేను కమాండర్ అని అన్నారు. కానీ విచిత్రమేమిటంటే, హోంమంత్రి అమిత్‌షా గుజరాత్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి. దీని వల్ల సుప్రీంకోర్టు అతన్ని గుజరాత్ నుంచి బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వ్యక్తి మనకు నేడు హోంమంత్రి. మనం ఎటువైపు వెళ్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ దేశం ఎవరి చేతుల్లో ఉందో వారు మనల్ని, మన దేశాన్ని తప్పు దారిలో తీసుకెళ్తారని నాకు వంద శాతం నమ్మకం ఉంది. మేము దీనిపై దృష్టి పెట్టాలి’అని అన్నారు.
కాగా 2010లో అమిత్‌షా 2010లో రెండు సంవత్సరాలపాటు గుజరాత్‌నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ సమయంఓ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. అప్పటికే బీజేపీ నేత సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
గుజరాత్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఆ ఎన్‌కౌంటర్ నకిలీదేనని అంగీకరించింది. అనంతరం అమిత్ షా సీబీఐకి దొరక్కుండా నాలుగు రోజులు కనిపించకుండాపోయారు. చార్జిషీట్ దాఖలవడంతో 2010 జులై 24న అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కోర్టు ఆయనకు గుజరాత్‌లో అడుగుపెట్టరాదన్న షరతుపై బెయిలు మంజూరు చేసింది. అప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా.. గత ఆదివారం పుణెలో అమిత్‌షా మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు. పవార్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో మళ్లీ బలం పుంజుకుని తాము ప్రభంజనం సృష్టించబోతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment