ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతను డబ్బులు కోసం బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 72 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 750 కిలోమీటర్లు వెంటాడి సినీ ఫక్కీలో అతడిని అరెస్ట్ చేశారు. అసలు ఎవరీ అనిల్.. పోలీసుల అతని కోసం ఎందుకంత తీవ్రంగా శ్రమించారు?
అనిల్ జైసింఘానీ కుమార్తె అనిక్ష మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ సతీమణి అమృతతో పరిచయం ఏర్పరచుకుంది. క్రికెట్ బుకీ అయిన తన తండ్రి అనిల్‌ను కేసుల నుంచి బయటపడేయమని కోరింది. అందుకు మొదట రూ.కోటి ఇస్తానని తెలిపింది.
అయితే అందుకు అమృతా నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్ వీడియోలను తయారు చేసి వాటిని లీక్ చేస్తానని అమృతపై బెదిరింపులకు పాల్పడింది. దీంతో అమృతా ఫడణవీస్ వారిపై బ్లాక్‌మెయిల్ బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గుజరాత్ వెళ్లి అనిల్ జైసింఘానిని అరెస్టు చేసింది. అనంతరం అతడిని తీసుకొచ్చి మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది.
ఇలా పట్టుకున్నారు
అనిల్ జైసింఘానీ చాలా ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకొచ్చారు. ఇన్నాళ్లుగా అనిల్ జైసింఘానీ టెక్నాలజీ సాయంతో దాక్కుంటూ వచ్చాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఎన్‌క్రిప్టెడ్ కాల్స్ చేస్తున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పడి చివరికి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై మొత్తం 15 కేసులు నమోదు కాగా అనేక ఇతర కేసులలో కూడా వాంటెడ్ గా ఉన్నాడు అనిల్.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్డోలీలో అతన్ని పట్టుకోవడానికి ఉచ్చు బిగించినప్పటికీ, అతను అక్కడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సూరత్ వెళ్లి అక్కడి నుంచి కూడా పారిపోయినట్లు తెలిపారు. చివరికి వడోదర, బరూచ్ మీదుగా గోద్రాకు పారిపోతుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్, కారుతో పాటు పలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment