‘మిథ్యా’హ్న భోజనం
‘మిథ్యా’హ్న భోజనం
Published Tue, Sep 27 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
* మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకుల అవస్థలు
* నాలుగు నెలల నుంచి బిల్లులు నిలిపివేత
* నిర్వహణ భారంగా మారిందని ఆవేదన
* అర్ధాకలితో విద్యార్థులు
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నిర్వహణ భారంగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు అంటున్నారు. అప్పులు చేసి అన్నం వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు అందకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేని పరిస్థితి నెలకొంది.
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు ఎడ్యుకేషన్ : మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.4.78, హైస్కూలు విద్యార్థులకు రూ.6.84 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వంట ఏజెన్సీలకు గౌరవ వేతనంగా నెలకు రూ.1000 ఇస్తున్నారు. ప్రభుత్వం మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు. జిల్లాలో పథకం నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు రూ.2.5 కోట్లు, వంట ఏజెన్సీల గౌరవ వేతనం రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.4.5 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయాయి.
దొడ్డు బియ్యమే గతి...
మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకు సన్నబియ్యాన్ని సరఫరా చేయాలి. అయినా వచ్చిన సన్నబియ్యాన్ని డీలర్లు, అధికారులు కుమ్మక్కై పాఠశాలలకు సరఫరా చేయటం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో దొడ్డు బియ్యమే విద్యార్థులకు గతి అవుతోంది. దీంతో అన్నం గంజి కట్టి, ముద్దగా మారడం, దీనికి తోడు కూరలు కూడా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
సహాయకులకు పేరుకుపోయిన బకాయిలు...
ఎండీఏ సహాయకులకు గౌరవ వేతనం రూపంలో నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాల్సిన నిధులు సైతం చెల్లింపులకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ తీరుతో ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఏజెన్సీలను నెట్టుకొస్తున్నారు. మెనూలో ఏ ఒక్కటి తగ్గినా ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అదే స్థాయిలో వారికి చెల్లింపులు జరపడంపై దృష్టి సారించడం లేదు.
త్వరలో బిల్లులు చెల్లిస్తాం..
మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ బిల్లుల కోసం ప్రభు్తత్వం నిధులు మంజూరు చేసింది. మండలాల నుంచి తహసీల్దార్లు బిల్లులు సమర్పిస్తే, ఆన్‌లైన్‌లో వంట ఏజెన్సీ ఖాతాల్లో బిల్లులు జమ అవుతాయి.
– శ్రీనివాసులరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
Advertisement
Advertisement