
మాజీ ఎంపీ వీహెచ్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్న భట్టి విక్రమార్క
దోమలగూడ: అరవై ఏళ్లుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన హైదరాబార్ నగరం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాలనలో కుప్ప కూలిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రేటర్ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా కాంగ్రెస్ నేత వి హనుమంతరావు బుధవారం ఇందిరాపార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చే పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని, డల్లాస్, న్యూయార్కులను తలదన్నేలా తీర్చిదిద్దుతామని ప్రచారం చేశారన్నారు.
ప్రస్తుతం ప్రజలు మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోతున్నారని, బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తామో, రామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పాలనానుభవం లేని ప్రభుత్వం, నాయకులే ఇందుకు కారణమన్నారు. అసెంబ్లీ ముందు నుంచి మెట్రో వద్దని అడ్డుకున్న ముఖ్యమంత్రి అదే డిజైన్‌కు అనుమతి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చారిత్రకమైన ఉస్మానియా, సచివాలయాలను çకూల్చాలనుకోవడం దారుణమన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా విఫలమయ్యాడన్నారు.
జీహెచ్‌ఎంసీలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కార్పొరేటర్లకు నిధులు కేటాయించడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ గంతల హైదరాబాద్‌గా మారిందని, గత కమిషనర్ సోమేష్‌కుమార్ వైఖరి, అవినీలే ఇందుకు కారణమని ఆరోపించారు. వి హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేటర్లకు నిధులు లేక పనులు చేయడం లేదని, మేయర్‌కు ప్రభుత్వాన్ని నిధులు అడిగే ధైర్యం లేదన్నారు. అసదుద్దీన్ సోదరులు కూడా నగర సమస్యలపై నోరు మెదపక పోవడం దారుణమన్నారు.
సీఎం రోజుకో కొత్త ఆలోచన ముందుకు తెస్తున్నారని, జిల్లాల విభజన పేరుతో ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నారని ఆరోపించారు.కోదండరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఆదాయం ఎక్కడికి వెళుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వనగరం ప్రక్రియను పోలీసులకు వాహనాలు, ఇంటింటికి చెత్త డబ్బాలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీఎమ్మేల్సీ సుధాకర్‌రెడ్డి, నాయకులు కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, కార్తీకరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ఇందిరాశోభన్, అనిల్‌కుమార్ యాదవ్, రమ్యారావు, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.