ప్రేమించి మూడు నెలల ముచ్చట చేశాడు.. | Harassment mother in law | Sakshi
Sakshi News home page

ప్రేమించి మూడు నెలల ముచ్చట చేశాడు..

Published Sat, Apr 30 2016 4:33 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

ప్రేమించి మూడు నెలల ముచ్చట చేశాడు.. - Sakshi

ప్రేమించి మూడు నెలల ముచ్చట చేశాడు..

చలివిడి చేసి అత్తారింటికి పంపితే శవమై వచ్చింది
ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే చంపేశారు
కూతురు మృతిపై న్యాయం చేయాలని రోదిస్తున్న తల్లి

 
గుడివాడ : పెళ్లి చేసుకుని మూడు నెలల ముచ్చట తీరకముందే తన బిడ్డను చంపేశారు. అత్తారింటికి వెళ్లాలంటే చలివిడి చేసి పంపాను.. ఇంటికెళ్లి అరగంట గడవక ముందే శమైందని కబురు వచ్చింది. నా బిడ్డను నిలువునా బలి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ గ్రామంలో వివాహిత మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


అత్తారింటికి వెళ్లిన అరగంటకే అస్వస్థత
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామానికి చెందిన కొణతం ఆంజనేయులు కుమారుడు కొణతం లీలా శోభన్‌కుమార్ అదే గ్రామానికి చెందిన కట్టా మాణిక్యం కుమారై కృష్ణకుమారిలు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే శోభన్‌కుమార్‌కు తల్లిదండ్రులు వేరొక యువతితో పెళ్లికి సిద్ధం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5న శోభన్ తన ప్రియురాలు కృష్ణకుమారిని తీసుకెళ్లి ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నాడు. అయితే శోభన్‌కుమార్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో కృష్ణకుమారి తల్లి ఇంటి వద్ద వీరిద్దరూ కాపురం చేసుకుంటున్నారు. శోభన్ నూడిల్స్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా ఇటీవల అతను తన తల్లిదండ్రులకు చేరువయ్యాడు.

ప్రస్తుతం మంచి రోజులు అయిపోతున్నం దున కోడలిని ఇంటికి తీసుకొచ్చి గుమ్మాలు దాటించాలని శోభన్ తల్లిదండ్రులు కోరారు. దీంతో కృష్ణకుమారి తల్లి గురువారం ఉదయం చలివిడి చేసి అత్తారింటికి పంపించింది. ఇంట్లోకి వెళ్లాక అక్కడ పానకం ఇచ్చారని తాగిన వెంటనే పడిపోయిందని తల్లి మాణిక్యం ఆరోపిస్తోంది. తన ఇల్లు మార్గమధ్యంలోనే ఉన్నా తనకు చెప్పకుండానే అస్వస్థతకు గురైన తన కూతురును గుడ్లవల్లేరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యమంలోనే చనిపోయిందని పేర్కొన్నారు.

తన కూతురంటే ఇష్టం లేకే వారు చంపేశారని, తనకు భర్త లేకపోయినా ఇద్దరు బిడ్డల్ని చూసుకుని బ్రతుకుతున్నానని నా ఇంటి దీపాన్ని ఆర్పేసారని తల్లి మాణిక్యం రోదించింది. బుధవారం కేసు నమోదు చేయటంతో కృష్ణకుమారి మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురు మృతిపై తనకు న్యాయం చేయాలని వచ్చిన వారందరినీ ఆమె వేడుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement