దివ్యాంగురాలిపై దాష్టీకం ఘోరం
దివ్యాంగురాలిపై దాష్టీకం ఘోరం
Published Sat, Aug 27 2016 7:41 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
నరసరావుపేట: ప్రభుత్వ వైద్యశాలకు వెనుకవైపున నివాసం ఉంటున్న దివ్యాంగురాలు నంద్యాల నాగసుబ్బమ్మపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ ప్లోర్‌లీడర్ పాలపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాగమ్మ కొంతకాలంగా నివాసం ఉంటూ మున్సిపాల్టీకి పన్నులు చెల్లిస్తుందన్నారు. ఇప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ భర్త రూ.50 వేలు ఇస్తేనే ఉండనిస్తామని, లేనిపక్షంలో ఖాళీ చేయాలని ఆమెపై దౌర్జన్యానికి దిగటం టీడీపీ వైఖరిని తెలియచేస్తుందని తెలిపారు. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు రెండు నియోజకవర్గాల్లో అవినీతికి పాల్పడుతుండటంతో అదే వైఖరిని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులూ అనుసరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి పోకడలను ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని కోరారు. మున్సిపల్ స్థలంలో దివ్యాంగురాలు ఉన్నదని అందుకే ఖాళీచేస్తున్నామని టీడీపీ నాయకుల ఆలోచనే అయితే పట్టణంలోని అనేక ప్రదేశాల్లో మున్సిపల్ స్థలాలు, రోడ్డు మార్జిన్లలో ఉన్న వారిని ఎందుకు ఖాళీచేయించటంలేదని ప్రశ్నించారు. కేవలం డబ్బులకోసం దివ్యాంగురాలిని ఇబ్బంది పెట్టడం శోచనీయమన్నారు. మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వం వెంటనే కలుగచేసుకొని దివ్యాంగురాలికి తగిన న్యాయం చేయాలని కోరారు. కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు మాట్లాడుతూ ప్రతిపక్ష కౌన్సిలర్లకు మున్సిపల్ కార్యాలయంలో కేటాయించిన వెయిటింగ్ హాల్‌లో కార్యాలయ ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వాడటం శోచనీయమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు కారుమంచి మీరావలి, షేక్ రెహమాన్, షేక్ మున్ని, గోగుల శంకరమ్మ, వార్డు నాయకులు సయ్యద్‌బాజీ, రవివర్మ, గేరా ధర్మారావు పాల్గొన్నారు.
Advertisement