
సాక్షి, విజయవాడ: టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతున్నాయని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ ఓ మహిళా కార్పొరేటర్ పైనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా పీఏ వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ కరువైందనడానికి ఇంతకన్నా నిదర్శమేముందని అన్నారు.
కార్పొరేటర్‌ను వేధింపులకు గురి చేయడమే కాకుండా, విషయం బయట పెట్టకుండా ఎంపీ నాని సెటిల్‌మెంట్‌కు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిని విధుల నుంచి తొలగించకుండా వారికి వంతపాడుతున్న టీడీపీ నాయకులకు మహిళలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే పీఏపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ తీరును ఎండగడతామన్నారు.