మహిళలపై వేధింపులకు శ్రీవాణియే నిదర్శనం
కశింకోట: మహిళలపై వేధింపులు జరుగుతున్నాయన్న దానికి శ్రీవాణియే నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. స్థానిక గవరపేట కనకమహాలక్ష్మి వీధిలో అత్తింటివారు కాపురానికి రానీయకపోవడంతో రామాలయంలో తలదాచుకుంటున్న భీశెట్టి శ్రీవాణిని సోమవారం ఆయన పరామర్శించారు. ఆమెకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
శ్రీవాణికి అండగా ఉంటాం
శ్రీవాణికి అండగా నిలిచి న్యాయం చేయడానికి కృషి చేస్తామని అమర్‌నాథ్ భరోసా ఇచ్చారు. 15 ఏళ్ల కిందట పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న శ్రీవాణిని భర్త, అత్తింటి వారు ఇంట్లోకి రానీయకుండా ఇబ్బందులు పెడుతుండటం శోచనీయమన్నారు. కనీసం పిల్లలను కూడా చూసే అవకాశాన్ని కల్పించకపోవడం సమంజసం కాదన్నారు.ఈ విషయమై పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కాపురానికి వచ్చిన భార్యను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటే చుట్టు పక్కల మహిళలు చేరదీయడం అభినందనీయమన్నారు. శ్రీవాణిని రెండు రోజుల వ్యవధిలో కాపురానికి తీసుకెళ్లాలని భర్త తారకేశ్వరరావుకు నచ్చజెబుతానన్నారు. లేదంటే స్థానికుల అండతో ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి శ్రీవాణికి న్యాయం చేకూరుస్తామని అమరనాథ్ పేర్కొన్నారు.
కన్నీళ్ల పర్యంతమైన శ్రీవాణి
కాపురానికి వచ్చిన తనను భర్త, అత్తింటివారు ఇంట్లోకి రానీయలే దని, కనీసం పిల్లలను కూడా చూడనీయలేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.అదనపు కట్నంగా భూమి రాయమని భర్త,అత్తింటి వారు వేధిస్తున్నారని, భూమి కోసం తన తల్లిని కొటి ్ట చంపినంతటి పని చేశారని ఆమె ఆరోపించారు. దీంతో కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. తనకు ప్రస్తుతం ఏ దిక్కూలేదని, కాపురం ముఖ్యమని, తన ను కాపురానికి తీసుకెళ్లి పిల్లలను చూపిస్తే కేసులను ఉపసంహరించుకుంటానన్నారు. తన కాపురాన్ని నిలిపి న్యాయం చేయాలని శ్రీవాణి కన్నీళ్లతో అమర్‌నాథ్‌ను అభ్యర్థించారు. అమర్‌నాథ్ వెంట మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబు, ఆర్‌ఈసీఎస్ డెరైక్టర్ పెంటకోట శ్రీనివాసరావు, జగన్ తదితరులు ఉన్నారు.