పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు నాయకులకు నివాళ్లు అర్పిస్తున్న అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షు
పలాస: ఒడిశాలోని ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో తమ వారిని వెతకడానికి ఉత్తరాంధ్ర అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, పౌరహక్కుల సంఘం నాయకులు మంగళవారం ఉదయం ఉద్దానం ప్రాంతం నుంచి మల్కన్‌గిరికి తరలివెళ్లారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన అమరవీరుల మృతదేహాలు వారి కుటుంబాలకు అప్పగించి వారి చేసిన త్యాగాలను ప్రజలకు వివరించడానికి 2007లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన అమరుల బంధుమిత్రుల కమిటీకి మొదట అధ్యక్షుడుగా ఉద్దాన ప్రాంతానికి చెందిన నాటి నక్సల్బరి పోరాట యోధుడు గోరు మాధవరావు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్త గంటి ప్రసాదం ఆ కమిటీకి రెండోసారి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరిద్దరు కూడా ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా గంటి ప్రసాదం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. ప్రస్తుతం గూడ అంజమ్మ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. గూడ అంజమ్మతో పాటు అమరుల బంధుమిత్రుల కమిటీ ఉత్తరాంధ్ర అధ్యక్షులు జోగి కోదండరావు, జిల్లా కార్యదర్శి మడ్డు ధనలక్ష్మి, దాసరి శ్రీరాములు, పౌరహక్కుల సంఘం నాయకులు పురుషోత్తం తదితరులు 20 మంది వాహనాల్లో మల్కన్‌గిరికి వెళ్లారు. గతంలో కనీసం మృతదేహాలను కూడా ఇవ్వకుండా అడవిలోనే పూడ్చిపెట్టేవారని, మృతదేహాలను కూడా తెచ్చుకోవడానికి ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే అమరుల బంధుమిత్రుల కమిటీ ఏర్పడిందని ఆయన జోగారావు చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళాలు సంచరించడమే కాకుండా వందల సంఖ్యలో కార్యకర్తలు ఉండేవారు. కోటబొమ్మాళి మండలం జీఎన్‌పేట గ్రామానికి చెందిన నంబాల కేశవరావు అలియాస్ గంగన్న, అలియాస్ బసవ రాజులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇతను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ శంకర్, అలియాస్ బాబులు ఉన్నారు. అలాగే బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు సుందరమ్మ అలియాస్ సునీత, సాదనలు కూడా విప్లవ బాటలోనే ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం జిల్లాలో మావోయిస్టు దళాల్లో పనిచేస్తున్న వారు ముగ్గురు, నలుగురు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఒకప్పుడు ఈ జిల్లాలో బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ నేడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లతో బలహీనపడుతూ వచ్చింది.
25 పి.ఎల్.ఎస్ 05ఎ–29040003–ఫోటో: పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు నాయకులకు నివాళ్లు అర్పిస్తున్న అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షులు గోరు మాధవరావు తదితరులు